75 మందిని పెళ్లిచేసుకుని.. 200 మందిని వేశ్యలుగా మార్చిన ఘరానా నేరస్థుడు!
మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతూ, ఒకరు ఇద్దరు కాదు ఏకంగా 75 మందిని పెళ్లిచేసుకున్న ఘరానా నేరస్థుడు పోలీసులకు పట్టుబడ్డాడు. బంగ్లాదేశ్ నుంచి మహిళలను భారత్‌లోకి అక్రమంగా రవాణా చేస్తూ, వారిని వ్యభిచార కూపంలోకి నెట్టేశాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఇటీవల ఓ సెక్స్ రాకెట్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. వ్యభిచార కూపం నుంచి 21 మంది అమ్మాయిలను రక్షించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు బంగ్లాదేశ్‌లోని జాసూర్‌కు చెందిన మునిర్ ఉల్ దాజీ గుజరాత్‌లోని సూరత్‌లో పోలీసులకు చిక్కాడు. నిందితుడు మునిర్ ఉల్ దాజీ అలియాస్ మునిరుల్.. ఉపాధి నెపంతో బంగ్లాదేశ్ యువతులను భారత్‌లోకి అక్రమ రవాణా చేసేవాడు. పశ్చిమ్ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ సరిహద్దుల ద్వారా ఈ అక్రమ రవాణా కొనసాగుతున్నట్టు దర్యాప్తులో తేలింది. అక్రమ రవాణాకు ఇబ్బంది లేకుండా సరిహద్దులోని అధికారులకు మునిర్ రూ.25వేల చొప్పున లంచం ఇచ్చేవాడు. అనంతరం బంగ్లాదేశ్ యువతులను ముంబయి, కోల్‌కతా ప్రధాన కేంద్రాలుగా వ్యభిచారంలోకి దింపేవాడని పోలీసులు తెలిపారు. నిందితుడు 200 మందికిపైగా యువతులను భారత్‌లోకి అక్రమ రవాణా చేసినట్లు వెల్లడించారు. అంతేకాదు, తాను ఇప్పటివరకు 75 మందిని వివాహం చేసుకున్నట్లు విచారణలో చెప్పడంతో పోలీసులు విస్తుపోయారు. పెళ్లి చేసుకున్న తర్వాత వ్యభిచారంలోకి దింపినట్టు నిందితుడు చెప్పాడు. భారత్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి అమ్మాయిల్ని ఇక్కడకు తీసుకొచ్చినట్టు పోలీసులు తెలిపారు. అంతేకాదు, యువతులను డ్రగ్స్‌కు బానిసలుగా మార్చినట్టు దర్యాప్తులో తేలిందని ఇండోర్ ఎస్పీ అశుతోష్ భాఘీర్ పేర్కొన్నారు. బంగ్లాదేశ్ నుంచి అమ్మాయిల్ని అక్రమ రవాణా చేస్తున్న ముఠాలకు చెందిన 30 మందిని ఇప్పటి వరకూ అరెస్ట్ చేశామని తెలిపారు. జులైలో బెంగళూరులో వెలుగుచూసిన గ్యాంగ్ రేప్ ఘటనకు సంబంధించి పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో ఆసక్తిక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంగ్లాదేశ్ నుంచి వందల మంది మహిళలను అక్రమంగా భారత్‌కు తీసుకొచ్చినట్లు గుర్తించారు. ఉద్యోగాల పేరుతో అమాయక బంగ్లాదేశీ యువతులను తీసుకొచ్చి వ్యభిచార రొంపిలోకి దింపుతున్నట్లు తేలింది. పేద కుటుంబాలకు చెందిన యువతులను అక్రమంగా భారత్‌లోకి తరలించిన తర్వాత మొదట బెంగాల్‌లోని హౌరాకి తీసుకెళ్లి.. అక్కడే కొద్దిరోజుల పాటు ఉంచుతారు. ఆ సమయంలోనే నకిలీ గుర్తింపు కార్డులను సృష్టించి, చిన్న చిన్న గ్రూపులుగా విభజించి వివిధ నగరాలకు తరలిస్తున్నారు. ఇండోర్ పోలీస్ అధికారి తజీబ్ ఖాజీ మాట్లాడుతూ.. వ్యభిచారం కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేశామని తెలిపారు. వ్యభిచారం జరుగుతోందన్న పక్కా సమాచారంతో విజయ్ నగర్‌లోని ఓ గెస్ట్‌హౌస్‌పై దాడిచేశామని, ఈ సమయంలో 21 మంది యువతులు పట్టుబడ్డారన్నారు. వీరిలో 11 మంది బంగ్లాదేశ్ అమ్మాయిలు, మిగతావారు దేశంలోని పలు పట్టణాలకు చెందినవారని అన్నారు. వీరిని దేశంలోకి అక్రమంగా తీసుకొచ్చిన తర్వాత వ్యభిచారం చేయిస్తున్నారని తెలిపారు.
By October 06, 2021 at 08:41AM
No comments