ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగవేతదారుల గుట్టురట్టు.. జాబితాలో సచిన్ సహా 380 మంది భారతీయులు
ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగవేతదారుల గుట్టురట్టు చేస్తూ మరోసారి రహస్య పత్రాలు బహిర్గతమయ్యాయి. ‘పనామా పేపర్ల’ కన్నా శక్తిమంతంగా ‘పాండోరా పేపర్ల’ పేరుతో ఎంతో మంది ప్రముఖుల బాగోతాలు వెలుగులోకి వచ్చాయి. పన్ను శాతం తక్కువగా ఉన్న దేశాలకు పెద్దఎత్తున తరలించిన రహస్య సంపద, అక్రమ పెట్టుబడుల వివరాలన్నీ ఇందులో ఉన్నాయి. పాండారో జాబితాలో 91 దేశాలకు చెందిన వందలాది ప్రస్తుత, మాజీ అధ్యక్షులు, ప్రధానులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, దౌత్యాధికారులు, బిలియనీర్లు, వివిధ రంగాల ప్రముఖులు ఉన్నారు. వీరిలో ఆర్థిక నేరగాళ్లు, మాజీ ఎంపీలు, దర్యాప్తు సంస్థల పరిశీలనలో ఉన్నవారూ కలిపి దాదాపు 380 మంది భారతీయులు ఉండటం గమనార్హం. ‘ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్- () ఈ వివరాలను వెల్లడించింది. మొత్తం 117 దేశాల్లోని 150కిపైగా మీడియా సంస్థల్లోని 600 మంది జర్నలిస్ట్‌లు ఇందులో భాగస్వాములయ్యారు. ప్రపంచంలోనే అతిపెద్ద పరిశోధనాత్మక విశ్లేషణగా నిర్వాహకులు పేర్కొన్నారు. వివిధ దేశాల్లోని దాదాపు 1.20 కోట్ల ఆర్థిక లావాదేవీల పత్రాలను ఐజీఐజే పరిశీలించి నివేదికను వెల్లడించింది. విశ్లేషించిన మొత్తం సమాచారం పరిమాణం 2.94 టెరాబైట్ల మేర ఉంది. రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. భారత్, అమెరికా, రష్యా సహా 45 దేశాలకు చెందిన 130 మంది బిలియనీర్లు ఈ జాబితాలో ఉన్నారు. అలాగే, 336 మంది అత్యున్నత రాజకీయవేత్తలు, అధికారులకు విదేశాల్లో 956 కంపెనీల పేరిట పెట్టుబడులు ఉన్నట్లు వెల్లడయ్యింది. నకిలీ పేర్లు ఉపయోగించి తెరిచిన బ్యాంకు ఖాతాల సాయంతో వీరంతా ఆస్తులను రహస్యంగా కొనుగోలు చేసినట్టు తేలింది. ప్రపంచవ్యాప్తంగా 14 ఆర్ధిక సంస్థల నుంచి 11.9 మిలియన్ పత్రాలను బయటపడ్డాయి. పనామా, దుబాయ్, మొనాకో, స్విట్జర్లాండ్, కేమన్ ఐలాండ్స్ వంటి చోట్ల రహస్యంగా ఆర్థిక లావాదేవీలను సాగించారు. బ్రిటన్ కోర్టులో దివాలా ప్రకటించిన భారత పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి 18 ‘అసెట్ హోల్డింగ్ ఆఫ్‌షోర్ కంపెనీ’లు ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం సూత్రధారి, పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీ భారత్ వీడటానికి నెల ముందు ఆయన సోదరి ఒక ట్రస్టును ఏర్పాటు చేశారు. బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షా భర్త.. ఇన్‌సైడర్ ట్రేడింగ్ అభియోగాలపై సెబీ నిషేధాన్ని ఎదుర్కొంటున్న ఒక వ్యక్తితో కలిసి ట్రస్టును నెలకొల్పారు. 2016లో లీకైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు అప్రమత్తమైనట్టు పేర్కొన్నాయి. చాలా మంది భారతీయులు, ఎన్నారైలు విదేశాల్లోని తమ సంపదను పునఃవ్యవస్థీకరించారు. 2021 ప్రారంభం నాటికి రూ.20వేల కోట్లకుపైగా అప్రకటిత విదేశీ, స్వదేశీ సంపదను పన్ను అధికారులు గుర్తించారు. క్రికెట్ దిగ్గజం సచిన్ తెండూల్కర్.. పనామా పత్రాలు లీకైన మూడు నెలల తర్వాత బ్రిటిష్ వర్జిన్ దీవుల్లోని తన సంస్థను రద్దు చేసుకున్నారు. ఆయన తరఫు న్యాయవాది దీనిపై స్పందిస్తూ.. సచిన్ పెట్టుబడులన్నీ చట్టబద్ధమైనవేనని, పన్ను సంస్థలకు అన్ని వివరాలూ సమర్పించారని స్పష్టం చేశారు. గతంలో బయటికొచ్చిన పనామా పేపర్లలో.. పన్ను ఎగవేతే లక్ష్యంగా వ్యక్తులు విదేశాల్లో ఏర్పాటుచేసిన కంపెనీల గురించి ఉంది. కార్పొరేట్ సంస్థలు సృష్టించిన దొంగ కంపెనీల బాగోతం పారడైజ్ పేపర్లలో బయటపడింది. అంతర్జాతీయ ఒత్తిళ్ల నేపథ్యంలో అలాంటి డొల్ల కంపెనీల ఏర్పాటును అడ్డుకునేలా కొన్ని దేశాలు నిబంధనలను కఠినతరం చేశాయి. ట్రస్టుల రూపాల్లో ఎలా పన్ను ఎగవేత జరుగుతోందన్నది పాండోరా పేపర్లతో వెలుగులోకి వచ్చింది. కరీబియన్ దీవుల నుంచి దక్షిణ చైనా సముద్రంలోని పర్షియన్ గల్ఫ్ వరకు అనేక దేశాలకు చెందినవారి పేర్లు తాజా పరిశోధనలో బయటపడ్డాయి. జోర్డాన్ రాజు అబ్దుల్లా-2 అమెరికా, బ్రిటన్‌లలో రహస్యంగా సుమారు రూ.741 కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టారు. కాలిఫోర్నియా రాష్ట్రం మాలిబులో సముద్రం ఒడ్డున విలాసవంతమైన భవనాలు ఆయనకు ఉన్నాయి. బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్, ఆయన భార్య లండన్‌లో కార్యాలయం కొనుగోలు చేసినప్పుడు అక్రమంగా రూ.3.14 కోట్ల (3,12,000 పౌండ్లు) స్టాంపు డ్యూటీ ప్రయోజనం పొందినట్లు ఈ పత్రాలు పేర్కొన్నాయి. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ క్యాబినెట్ మంత్రులు, వారి కుటుంబసభ్యులు, సన్నిహితులు రహస్యంగా కంపెనీలు, ట్రస్టులు పెట్టి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. ఈ జాబితాలో ఆర్థికమంత్రి సౌకత్ తారిన్, ఆయన కుటుంబం, ఇమ్రాన్ మాజీ సలహాదారుడు వకార్ మసూద్ ఖాన్ (రెవెన్యూ, ఆర్థికం) కుమారుడు సహా 700 మంది పాకిస్థానీలు ఉన్నారు.
By October 04, 2021 at 08:44AM
No comments