Breaking News

2G కుంభకోణంలో తప్పుడు ఆరోపణలు.. కాంగ్రెస్ నేతకు మాజీ కాగ్ క్షమాపణ!


2జీ కేటాయింపుల వ్యవహారంలో కాంగ్రెస్‌ నేత సంజయ్‌ నిరుపమ్‌ పేరును తప్పుగా చెప్పానంటూ మాజీ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) వినోద్‌ రాయ్‌ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు కోర్టులో ఆయన గురువారం అఫిడ్‌విట్ సమర్పించారు. 2జీ కుంభకోణంపై ‘కాగ్‌’ ఇచ్చిన నివేదికలో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పేరు చేర్చరాదంటూ ఒత్తిడి తీసుకొచ్చిన కాంగ్రెస్ ఎంపీల్లో సంజయ్‌ నిరుపమ్‌ ఉన్నారంటూ వినోద్‌ రాయ్‌ ఆరోపించారు. 2014లో విడుదల చేసిన పుస్తకంతో పాటు పలు ఇంటర్వ్యూల్లోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. దీనిపై నిరుపమ్‌ పరువు నష్టం దావా వేయడంతో వినోద్‌ రాయ్‌‌కు కోర్టు సమన్లు జారీచేసింది. తాజాగా, నిరుపమ్‌పై తాను చేసిన ఆరోపణలన్నీ తప్పని రాయ్ ఒప్పుకొన్నారు. పాటియాలా హౌస్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేటు కోర్టులో అఫిడ్‌విట్ సమర్పించారు. మాజీ ప్రధాని మన్మోహన్ పేరును చేర్చవద్దంటూ ఒత్తిడిచేసిన ఎంపీల్లో ఉన్నారని తప్పుగా పేర్కొన్నానని అఫిడ్‌విట్‌లో వివరించారు. ‘నా ప్రకటనలు సంజయ్ నిరుపమ్‌, ఆయన కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులకు కలిగించిన బాధ.. వేదనను నేను అర్థం చేసుకున్నాను.. సంజయ్ నిరుపమ్‌కి, అతని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు నా తప్పుడు ప్రకటనల వల్ల కలిగిన బాధకు నేను బేషరతుగా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను.. సంజయ్ నిరుపమ్ నా క్షమాపణలను పరిగణలోకి తీసుకుంటారని, ఈ సమస్యను ముగించాలని నేను ఆశిస్తున్నాను’ అని తెలిపారు. ఆయన క్షమాపణను ఆమోదిస్తున్నట్టు సంజయ్‌ నిరుపమ్‌ చెప్పడంతో కేసును కోర్టు మూసివేసింది. ‘పరువు నష్టం కేసు నుంచి వినోద్ రాయ్‌‌కు ఉపశమనం లభించింది.. సంజయ్ నిరుపమ్ ఆయన క్షమాపణలను అమోదించారు.. దీంతో ఆయన స్టేట్‌మెంట్ రికార్డు చేసిన తర్వాత కేసును మూసివేశారు’ అని సంజయ్ తరఫున న్యాయవాది ఆర్కే హండూ అన్నారు. వినోద్ రాయ్ బయటికి తెచ్చిన ఈ బూటకపు నివేదికలపై దేశం మొత్తానికి క్షమాపణ చెప్పాలని సంజయ్ వ్యాఖ్యానించారు.


By October 29, 2021 at 12:11PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/ex-cag-vinod-rai-apologises-to-congress-leader-sanjay-nirupam-over-2g-spectrum-allegation/articleshow/87357678.cms

No comments