20 కిలోలు బరువు తగ్గి మరింత స్లిమ్‌గా కిమ్ జోంగ్ ఉన్..!
నిరంతరం దుందుడుకు చర్యలతో వార్తల్లో నిలిచే నియంత .. ఈసారి మరింత స్లిమ్‌గా మారి ప్రపంచాన్ని ఆకర్షించారు. తాజాగా, ఆయన దాదాపు 20 కిలోల బరువు తగ్గారని, పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఉత్తర కొరియా నిఘా సంస్థ వెల్లడించింది. పార్లమెంటు అంతర్గత సమావేశం సందర్భంగా చట్టసభ్యులకు ‘ది నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఎన్‌ఐఎస్)’ ఈ వివరాలను తెలిపింది. కిమ్ అనారోగ్యం బారిన పడినట్టు కనిపించలేదని, దేహదారుఢ్యాన్ని మెరుగు పరుచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల కారణంగానే ఆయన సన్నబడ్డారని పేర్కొంది. ఇక, 2019లో 140 కిలోల బరువున్న కిమ్.. అప్పటి నుంచి తగ్గించుకుంటున్నారని తెలిపింది. కృత్రిమ మేధస్సును ఉపయోగించి విశ్లేషణ ఆధారంగా ఉత్తర కొరియా అధినేత బాడీ డబుల్‌ను ఉపయోగిస్తున్నారనే పుకార్లు నిరాధారమైనవని ఏజెన్సీ పేర్కొంది. అయితే, ఈ అంచనాలు ముఖ కవళికలు, బరువును అంచనా వేసే నమూనాలు అధిక-రిజల్యూషన్ వీడియో విశ్లేషణపై ఆధారపడి ఉన్నాయని, కిమ్ మంచి ఆరోగ్యంతో ఉన్నట్లు కనిపించిందని అధికార పార్టీ చట్టసభ ప్రతినిధి కిమ్ యంగ్ కీ తెలిపారు. కాగా, ఉత్తర కొరియా అధినేత ఆరోగ్యంపై గత కొంతకాలం నుంచి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంది. ఈ ఏడాది జనవరి తర్వాత ఆయన కొన్ని నెలలపాటు అజ్ఞాతంలోకి వెళ్లడంతో దీనికి మరింత బలాన్ని చేకూర్చింది. ఒకానొక సమయంలో కిమ్ చనిపోయినట్టు అంతర్జాతీయ మీడియాలో ముమ్మర ప్రచారం సాగింది. కానీ, జూన్‌లో బాహ్య ప్రపంచానికి వచ్చిన ఆయన బరువు తగ్గినట్లు కనిపించిన ఫోటోలు హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో కిమ్‌కు అనారోగ్యం ఎక్కువయ్యిందా? బరువు తగ్గాలనే స్లిమ్‌గా మారారా? అనే చర్చ జరిగింది. ఇక సెప్టెంబరులో ఆర్మీ పరేడ్, అక్టోబరులో అణ్వాధాల ప్రదర్శనలోనూ ఆయన కనిపించకపోవడంతో మరోసారి చర్చనీయాంశమయ్యింది. ఇక, అణ్వాయుధ, క్షిపణి ప్రయోగాలతో ఐరాస ఆంక్షలకు తోడు కోవిడ్ కారణంగా ఏడాదిన్నర నుంచి అంతర్జాతీయ సరిహద్దులను మూసి ఉంచడం వల్ల ఉత్తర కొరియా మరింత సంక్షోభంలో కూరుకుపోయింది.
By October 29, 2021 at 11:31AM
No comments