Breaking News

పాక్‌లో భారీ భూకంపం.. 20 మంది మృతి.. వందలాది మందికి గాయాలు


పాకిస్థాన్‌లో గురువారం తెల్లవారుజామున భారీ సంభవించింది. భూకంపం ధాటికి 20 మంది మృతి చెందగా.. మరో 200 మందికి పైగా గాయపడ్డారు. బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లో సంభవించిన ఈ భూకంపం రికర్ట్ స్కేలుపై 5.9గా నమోదయ్యింది. భూప్రకంపనలతో క్వెట్టాలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రజలంతా గాఢనిద్రలో ఉండగా భూకంపం చోటుచేసుకోవడంతో చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పైకప్పులు, గోడలు కూలి మీదపడటంతో తీవ్రంగా గాయపడ్డారు. భూకంపం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ఆస్పత్రుల్లో క్షతగాత్రులకు ఫ్లాష్‌లైట్స్ సాయంతో చికిత్స చేస్తున్నారు. కొండ ప్రాంతంలో ఉన్న మారుమూల పట్టణం హర్నాయ్‌ భూకంపానికి తీవ్రంగా ప్రభావితమయ్యింది. అధ్వాన్నమైన రహదారులతో పాటు విద్యుత్ సౌకర్యాలు లేకపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. భూకంపం వల్ల ఇప్పటి వరకూ 20 మంది చనిపోయినట్టు సమాచారం అందిందని హోం మంత్రి మిర్ జియా ఉల్లా లాంగౌ అన్నారు. వీరిలో ఆరుగురు చిన్నారులు, ఓ మహిళలున్నట్టు ప్రావిన్సుల ప్రభుత్వ ఉన్నతాధికారి సుహైల్ అన్వర్ హసీమ్ అన్నారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్లను పంపనున్నట్టు పేర్కొన్నారు. అయితే, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని బలూచిస్థాన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ చీఫ్ నసీర్ నాజర్ అన్నారు. భూకంపం వల్ల ఆ ప్రాంతంలో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. టార్చ్, మొబైల్ ఫోన్ ఫ్లాష్‌లైట్స్ సాయంతో చికిత్స చేస్తున్నామని ప్రభుత్వ ఆస్పత్రి అధికారి ఒకరు తెలిపారు. గాయపడినవారిలో చాలా మందికి కాళ్లు, చేతులు విరిగిపోయాయని, కొందరికి ప్రథమ చికిత్స అనంతరం పంపుతున్నామని వివరించారు. కనీసం 40 మందికి తీవ్రగాయాలైనట్టు పేర్కొన్నారు. ఇక, పాకిస్థాన్‌లో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో రికర్ట్ స్కేలుపై 5.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. భూమికి 20 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు వెల్లడించింది.


By October 07, 2021 at 09:14AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/20-killed-hundreds-injured-as-earthquake-rattles-balochistan-province-of-pakistan/articleshow/86829455.cms

No comments