Breaking News

అరుణాచల్‌లో చైనాకు దీటుగా భారత్.. 15వేల అడుగల ఎత్తులో ఆర్టిలరీ యూనిట్


భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలకు దీటుగా జవాబిచ్చేలా భారత సైన్యం సిద్ధమయ్యింది. శత్రువుల యుద్ధ విమానాలను కూల్చివేసే ఎల్‌-70 విమాన విధ్వంసక శతఘ్నులు, హోవిట్జర్‌ శతఘ్నులు వంటి వాటిని వాస్తవాధీన రేఖ వెంబడి పెద్ద సంఖ్యలో మోహరించింది. సముద్ర మట్టానికి 15 వేల అడుగుల ఎత్తులో ఏకంగా ఆర్టిలరీ యూనిట్‌నే భారత్ సైన్యం నెలకొల్పింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటైన ఆర్టిలరీ యూనిట్‌ ఇదే కావడం గమనార్హం. వీటన్నింటితో కలిపి ఎల్ఏసీ వెంబడి ఇంటెగ్రేటెడ్‌ డిఫెండెడ్‌ లొకాలిటీలను సిద్ధం చేసింది. తూర్పు సెక్టార్‌లో వ్యూహాత్మక ప్రాంతమైన తవాంగ్‌ నుంచి వాస్తవాధీన రేఖకు వెళ్లే మార్గంలో పెద్ద సంఖ్యలో ఇలాంటి ప్రాంతాలు అనేకం కనిపిస్తాయి. ఆధునికీకరించిన ఎల్‌-70 విమాన విధ్వంసక శతఘ్నులను వ్యూహాత్మక ప్రాంతాల్లో భారత సైన్యం మోహరించింది. ‘అన్నిరకాల మానవ రహిత యుద్ధ విమానాలు, డ్రోన్లు, హెలికాప్టర్లు, విమానాలను ఇవి కూల్చేయగలవు.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ నిర్దేశిత లక్ష్యాలను చేరుకోగతల సాంకేతికత వీటి సొంతం. థర్మల్‌ ఇమేజింగ్‌ కెమేరా, లేజర్‌ రేంజ్‌ ఫైండర్‌ వంటివి దీనిలో ఉన్నాయి.. రాడార్‌తోనూ అనుసంధానమై ఉంటాయి.. నిమిషానికి 300 రౌండ్లు పేల్చగలవు.. దీనిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మూడు కెమెరాలు మూడు రకాలుగా ఉపయోగపడతాయి.. 360 డిగ్రీల యాంగిల్‌లో శత్రు విమానాలు, డ్రోన్లపై అగ్ని వర్షం కురిపిస్తోంది.. తూర్పు సెక్టార్‌లో వీటిని మోహరించడం ఇదే తొలిసారి’ అని కమాండర్‌ జాన్సన్‌ తెలిపారు. ఎం-777 అల్ట్రా లైట్‌ హోవిట్జర్‌ శతఘ్నులను కూడా ఈ సెక్టారులో ఏర్పాటు చేశారు.. కేవలం 4 టన్నుల బరువుండే వీటిని అవసరమైన చోట్లకు చినూక్‌ హెలికాప్టర్లలోనూ తరలించవచ్చు. లారీలోనూ రవాణా చేసే సౌలభ్యం ఉన్న హోవిట్జర్లు.. నిర్దేశిత స్థానానికి చేర్చిన తర్వాత కొన్ని నిమిషాల్లోనే వినియోగానికి సిద్ధం చేయవచ్చు. కేవలం 30 సెకన్లలోనే 40 కిలోమీటర్ల దూరం వరకూ విధ్వంసం సృష్టిస్తుంది. వీటికి అదనంగా కార్గిల్ యుద్ధంలో పాక్ వెన్ను విరిచిన బోఫోర్స్‌ గన్స్‌ను మోహరించారు. తూర్పు సెక్టార్‌లోని అస్సాంహిల్స్‌ సమీపంలో ఏర్పాటు చేసిన ఆర్టిలరీ యూనిట్‌ అత్యంత కీలకమైనది. ఇక్కడి నుంచి చైనా భూభాగం లోపల 50 కిలోమీటర్ల వరకూ అగ్ని వర్షం కురిపించవచ్చు. రఫేల్‌ యుద్ద విమానాలు, అపాచి, రుద్ర హెలికాప్టర్లనూ సమీకృత రక్షణ ప్రాంతాల్లో మోహరించారు. తూర్పు కమాండ్‌ పరిధిలోని 1,300 కిలోమీటర్ల పొడవైన సరిహద్దులను శత్రు దుర్భేద్యం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని ఓ అధికారి వెల్లడించారు. ఆయుధాలు, ఆహారం, సమాచార వ్యవస్థ వంటి వాటిని అనుసంధానం చేస్తూ ప్రత్యేక పద్ధతిలో అత్యాధునిక బంకర్లను నిర్మించారు. ఇందులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమాండ్‌ కేంద్రంలో కూర్చొని క్షేత్రస్థాయిలో పోరాడుతున్న సైనికులకు సూచనలు అందజేయవచ్చు. ఇక్కడ ఏర్పాటు చేసిన స్క్రీన్‌లో తన పరిధిలోని యుద్ధ క్షేత్రం మొత్తం కమాండ్‌ కేంద్రంలోని అధికారికి కనిపిస్తుంది. శాటిలైట్ నుంచి నేరుగా సమాచారం అందుతుంది.


By October 21, 2021 at 08:58AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/border-standoff-army-well-poised-to-hold-the-line-against-china-in-arunachal/articleshow/87175328.cms

No comments