దెబ్బకు దిగొచ్చిన బ్రిటన్.. భారతీయులపై ఆంక్షలు ఎత్తివేత.. అక్టోబరు 11 నుంచే అమలు
కొవిషీల్డ్ లేదా యూకే గుర్తించిన ఏదైనా రెండు డోసుల కోవిడ్-19 టీకా తీసుకున్న భారతీయులు క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని బ్రిటన్ ప్రకటించింది. అక్టోబరు 11 నుంచి యూకేకు వచ్చే భారతీయులపై ఎటువంటి ఆంక్షలు ఉండబోవని ఈ మేరకు బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ ట్విట్టర్‌లో తెలిపారు. తాజా ప్రకటనతో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న టీకా వివాదానికి ముగింపు పలికినట్టయ్యింది. భారత్‌లో తీసుకున్న కొవిషీల్డ్ టీకా తాము గుర్తించడం లేదని యూకే ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిబంధనలపై తీవ్రంగా స్పందించిన బ్రిటన్‌పై ప్రతీకార చర్యలకు ఉపక్రమించింది. దీంతో కాళ్లబేరానికి వచ్చిన బ్రిటన్.. నిబంధనలను సవరించింది. “అక్టోబరు 11నుంచి బ్రిటన్ వెళ్లే భారతీయులు కోవిషీల్డ్ రెండు డోసులు లేదా రెగ్యులేటర్ ఆమోదించిన ఏదైనా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నా క్వారంటైన్ అవసరం ఉండదు... కాబట్టి ఇక నుంచి యూకే వెళ్లడం సులభం. ఈ విషయంపై తమ ప్రభుత్వానికి సహకరించినందుకు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు’ అంటూ అలెక్స్ ఎల్లిస్ వీడియో సందేశంలో తెలిపారు. విద్యార్థులు, వ్యాపారులు, పర్యాటకులకు సంబంధించి వేలాది వీసాలను సిద్ధం చేసినట్లు బ్రిటిష్ హైకమిషనర్ పేర్కొన్నారు. ‘గత కొన్ని వారాలుగా ఈ సమస్య వల్ల చాలా మంది యూకేకి వెళ్లకుండా ఆగిపోయారో తెలుస్తుంది... రెండు దేశాల మధ్య మరిన్ని విమానాలను ప్రారంభిద్దాం’ అని తెలిపారు. దీనిపై యూకే మంత్రి గ్రాంట్ షాప్స్ కూడా స్పందించారు. ‘నేను కూడా మార్పులు చేస్తున్నాను కాబట్టి ఇంగ్లాండ్‌ని సందర్శించే ప్రయాణికులకు కొన్ని స్వల్ప ఆంక్షలు ఉన్నాయి.. భారత్, టర్కీ, ఘనా సహా 37 దేశాల నుంచి పూర్తిస్థాయి రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుని వచ్చేవారి యూకే ప్రయాణీకుల మాదిరిగానే పరిగణిస్తాం’ అన్నారు. కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ భారత్ నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా 10 రోజుల క్వారంటైన్‌లో ఉండాలన్న యూకే నిబంధనలు వివాదాస్పదమయ్యాయి. వాటిని తీవ్రంగా ఖండించి భారత్.. అవి వివక్షాపూరితమేనని స్పష్టం చేసింది. ఈ విషయంలో బ్రిటన్ వెనక్కి తగ్గకపోతే తామూ దీటుగానే స్పందిస్తామని హెచ్చరించింది. భారత్ కూడా ప్రతిచర్యలకు ఉపక్రమించింది. బ్రిటన్ నుంచి వచ్చే పౌరులపైనా ఆంక్షల విధించాలని నిర్ణయించిందది. ఇందులో భాగంగా బ్రిటన్ నుంచి వచ్చేవారికి 10 రోజులు క్వారంటైన్, మూడుసార్లు కొవిడ్ టెస్టులు వంటి ఆంక్షలు అమలు చేయాలని భావించింది. అక్టోబర్ మొదటి వారం నుంచే ఈ నిబంధనలు అమల్లో తేవాలని యోచించినా బ్రిటన్ వెనక్కు తగ్గడంతో వివాదం సద్దుమణిగింది.
By October 08, 2021 at 07:36AM
No comments