Breaking News

WHO Covaxin డబ్ల్యూహెచ్ఓ కొర్రీలు.. కొవాగ్జిన్‌కు గుర్తింపు మరింత జాప్యం?


అభివృద్ధి చేసిన కోవిడ్-19 టీకా కొవాగ్జిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నుంచి అత్యవసర వినియోగం గుర్తింపు (EUA) కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ విషయంలో మరింత జాప్యం జరిగే సూచనలు కనబడుతున్నాయి. తాజాగా, వ్యాక్సిన్‌కు సంబంధించి సాంకేతిక అంశాలపై మరిన్ని సందేహాలను వెలిబుచ్చి, భారత్ బయోటెక్‌ను వివరణ కోరినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ జాప్యంతో భారతీయులు ముఖ్యంగా విద్యార్థులు, అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారిపై తీవ్ర ప్రభావం చూపనుంది. భారత్ స‌హా కొన్ని దేశాల్లో ఇప్ప‌టికే అత్య‌వ‌స‌ర వినియోగం కొన‌సాగుతున్నా… డ‌బ్ల్యూహెచ్ఓ గుర్తింపు పొందిన క‌రోనా వ్యాక్సిన్ల జాబితాలో మాత్రం లేదు. డబ్ల్యూహెచ్ఓ EUA లేకుండా కొవాగ్జిన్‌ను ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఆమోదం లభించిన టీకాగా పరిగణించవు. టీకా ఆమోదం కోసం భారత్ బయోటెక్ అవసరమైన డేటాను సమర్పించినట్టు తెలిపినప్పటికీ డబ్ల్యూహెచ్ఓ తాజాగా పలు సాంకేతిక అంశాలపై వివరణ కోరింది. కొవాగ్జిన్‌కు అత్యవసర వినియోగం గుర్తింపు విషయంలో డబ్ల్యూహెచ్ఓ నుంచి ఏ క్షణంలోనైనా అనుమతి రావచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవలే వ్యాఖ్యానించింది. కానీ, తాజా పరిణామాలతో మరికొన్ని రోజులు జాప్యం తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ‘అమోదం కోసం డాక్యుమెంట్లను సమర్పించడానికి ఓ విధానం ఉంది. కొవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర వినియోగ గుర్తింపు త్వరలో లభిస్తుంది’ అని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ అన్నారు. కోవిడ్ టాస్కఫోర్స్ అధ్యక్షుడు డాక్టర్ వీకే పాల్ సైతం ఈ నెలాఖరుకు కొవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం లభించే అవకాశం ఉందన్నారు. కాగా, కొవాగ్జిన్ అత్యవసర గుర్తింపునకు సంబంధించి డబ్ల్యూహెచ్ఓకి చెందిన స్ట్రాటజిక్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఎక్స్ పర్ట్స్ ఆన్ ఇమ్యునైజేషన్ (SAGE) అక్టోబర్ 6న చర్చించనున్నట్టు తెలుస్తోంది. SAGE ముసాయిదా ఎజెండా ప్రకారం, టీకాను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ అక్టోబర్ 6న క్లినికల్ ట్రయల్స్ (దశ 1-3 ట్రయల్ ఫలితాలు, పోస్ట్ మార్కెటింగ్) రిస్క్ మేనేజ్‌మెంట్ ప్లాన్లు, వ్యాక్సిన్ భద్రత, సమర్థత డేటాపై ప్రజెంటేషన్ ఇస్తుందని భావిస్తున్నారు. అక్టోబర్ 6న జరిగే సెషన్‌లో కొవాగ్జిన్ సమర్పించిన డేటాపై చర్చించనున్నారని సమాచారం. మూడు దశల క్లినికల్ ట్రయల్స్, కొవాగ్జిన్ క్లినికల్ డేటా, భద్రత, ఇమ్యునోజెనిసిటీ, సమర్థతపై పోస్ట్ మార్కెటింగ్ స్టడీస్‌ని క్షుణ్ణంగా చర్చిస్తుందని, టీకా భద్రతా పర్యవేక్షణ కోసం ప్రపంచ, ప్రాంతీయ, దేశ స్థాయి ప్రణాళికలను అప్‌డేట్ చేస్తారని తెలిసింది.


By September 28, 2021 at 07:53AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bharat-biotech-covaxin-clearance-delayed-further-over-technical-queries-by-who-sources/articleshow/86573646.cms

No comments