బూస్టర్ డోస్ వేసుకున్న జో బైడెన్.. టీకా తీసుకోని అమెరికన్లపై ఆగ్రహం
కోవిడ్ టీకా బూస్టర్ డోస్‌పై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో అమెరికా అధ్యక్షుడు సోమవారం బూస్టర్ డోస్ తీసుకున్నారు. వైట్‌హౌస్‌లో మూడో డోస్ తీసుకున్న అనంతరం బైడెన్ మాట్లాడుతూ.. చాలా మంది అమెరికన్లు ఇప్పటికీ టీకాలు తీసుకోలేదని అన్నారు. వీరు దేశాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల ఫైజర్ టీకా బూస్టర్ డోస్‌కు అమెరికా అనుమతించిన విషయం తెలిసిందే. 65 ఏళ్ల వృద్ధులు, తీవ్రమైన అనారోగ్య సమస్యలున్నవారికి ఫైజర్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌గా వేసుకోవచ్చని ఎఫ్‌డీఏ తెలిపింది. నేను అలా కనిపించడంలేదని తెలుసు, కానీ నాకు 65 ఏళ్లు నిండాయని బైడెన్ చమత్కరించారు. ఇప్పటి వరకూ కనీసం ఒక్క డోస్ కూడా వేసుకోకుండా చాలా మంది నిరాకరిస్తున్నారని, దీని వల్ల దేశవ్యాప్తంగా డెల్టా వేరియంట్ వ్యాప్తిచెందుతోందని అన్నారు. ఇప్పటి వరకూ 77 శాతం మంది అమెరికన్లు మాత్రమే టీకా వేసుకున్నారన్నారు. ఇది సరిపోదని, దాదాపు మూడో వంతు మంది టీకా తీసుకోడానికి సముఖంగాలేరన్నారు. బూస్టర్ డోస్ తీసుకున్న విషయాన్ని బైడెన్ ట్విట్టర్‌లోనూ వెల్లడించారు. ‘ఈ రోజు కోవిడ్ బూస్టర్ డోస్ తీసుకున్నారు.. మొదటి, రెండో డోస్ మాదిరిగానే ఇది చాలా సురక్షితం, సులభం.. టీకాలు వేసుకుని కలిసికట్టుగా వైరస్‌ను ఓడించి, ప్రాణాలను నిలబెట్టుకుందాం’ అని బైడెన్ ట్వీట్ చేశారు. ఫైజర్ టీకా రెండో డోస్ తీసుకున్న ఆరు నెలల తర్వాతే బూస్టర్ డోస్ వేసుకోవాల్సి ఉంటుందని ఎఫ్‌డీఏ తెలిపింది. ‘ఈ మహమ్మారి వేళ వ్యాక్సిన్‌ల విషయంలో ఎఫ్‌డీఏ నిర్ణయం తీసుకోవడంతో శాస్త్రీయత, ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా మార్గనిర్దేశం చేస్తాయని నేటి చర్య నిరూపిస్తుంది’ అని గతవారం FDA చీఫ్ జనత్ ఉడ్‌కాక్ వ్యాఖ్యానించారు. పది రోజుల కిందట రెగ్యులేటరీ ఏజెన్సీ ఏర్పాటు చేసిన స్వతంత్ర నిపుణుల కమిటీ సిఫారసు చేయడానికి అనుకూలంగా ఓటు వేసిన తర్వాత బూస్టర్ డోస్‌పై ఎఫ్‌డీఏ నిర్ణయం వెలువడింది. అయితే, 16 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి ఒక్కరికీ ఫైజర్ వ్యాక్సిన్ బూస్టర్‌ల అందజేయాలన్న సిఫార్సులను వైట్‌హౌస్ తోసిపుచ్చింది. అధ్యక్షుడు జో బైడెన్ యంత్రాంగం వీరిని సుతిమెత్తగా మందలించింది.
By September 28, 2021 at 08:18AM
No comments