Breaking News

Teachers Day 2021 గురువులకే గురువు.. దేశం గర్వించే వ్యక్తిగా ఎదిగిన సర్వేపల్లి


మాతృదేవోభ‌వ‌, పితృదేవోభ‌వ‌, ఆచార్యదేవోభవ తల్లిదండ్రుల తర్వాత అంతటి గొప్ప స్థానాన్ని గురువుకి భారతీయ సమాజం కల్పించింది. పూర్వకాలంలో గురువులను వెదుక్కొంటూ వెళ్లి, ఆయనను ప్రసన్నం చేసుకుని సకల విద్యలను శిష్యులు నేర్చుకునేవారు. విద్యాభ్యాసం పూర్తయినంతవరకు ఆయన సహచర్యంలోనే గడిపి నిరంతరం గురువు పట్ల భక్తి శ్రద్ధలు కనబరిచేవారు. అయితే నేటి ఆధునిక కాలంలో మాత్రం గురువు అనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను చెప్పుకుంటారు. తన పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలంటూ జన్మదినం రోజున శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చివారిని ఉద్దేశించి డాక్టర్ అన్నారు. తరాలు మారినా గురుస్థానం మారకూడదన్న తన ఆశయానికి అనుగుణంగా ఆ మహనీయుడు చేసిన సూచన భారతదేశ చరిత్రలో సెప్టెంబరు 5కి విశిష్ట స్థానాన్ని కల్పించింది. సకల విద్యాపారంగతుడైన రాధాకృష్ణ పండితుని స్మరించుకునే అవకాశాన్ని అందించింది. జాతి ఆర్థిక వ్యవస్థను పరిపుష్టిని కల్పించే దిశగా మంచి ఉపాధ్యాయులు ప్రముఖపాత్ర వహిస్తారు. అందుకే ప్రజలు, తన భవిష్యత్తు మీద దేశం పెట్టదగిన అత్యంత ముఖ్యమైన పెట్టుబడుల్లో విద్య ఒకటి. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటోందనే నానుడే ఇందుకు నిదర్శనం. విద్యపై అపారమైన అనురక్తి కలిగిన డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ స్వయంగా అధ్యాపకుడు, విఖ్యాత దౌత్యవేత్త, పండితుడు. రెండుసార్లు భారత రాష్ట్రపతిగా సేవలందించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుత్తణి గ్రామంలో 1888 సెప్టెంబరు 5 న జన్మించారు. ఓ సాధారణ తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆయన విద్యాభ్యాసం అనేక ఒడిదొడుకుల మధ్య కొనసాగింది. కటిక పేదరికాన్ని అనుభవించిన సర్వేపల్లికి కనీసం చదువుకోవడానికి పుస్తకాలు కూడా ఉండేవి కావు. అలాంటి పరిస్థితుల్లో పుస్తకాలు కొనుక్కోగలిగిన స్థోమత ఉండి, కొనుక్కున్న వ్యక్తి ఇంటికి వెళ్లి ఆయనను ‘అయ్యా..ఒక్క కాగితం నలగకుండా నేను పుస్తకం చదువుకుంటాను. దయచేసి నాకు పుస్తకం ఇప్పించండి’ అని ప్రార్థించి పుస్తకాన్ని తెచ్చుకుని చదువుకునేవారు. పుస్తకాలు ఉన్న వ్యక్తులు తనను ఎప్పుడు రమ్మంటే అప్పుడే వెళ్లి, వాటిని తెచ్చుకుని చదివి గొప్ప తత్వవేత్త అయ్యారు. తత్వశాస్త్రంపై మక్కువతో అదే ప్రధానాంశంగా మాస్టర్స్ డిగ్రీలో ‘ది ఎథిక్స్ ఆఫ్ వేదాంత’ను థీసిస్‌గా ఎంపిక చేసుకుని 20వ ఏటనే సమర్పించిన ప్రతిభాశాలి. 21 ఏళ్లకే మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో లెక్చరర్‌గా చేరిన రాధాకృష్ణన్ ప్రతిభను గుర్తించిన మైసూరు విశ్వవిద్యాలయం ఆయనను తత్వశాస్త్ర విభాగం ప్రొఫెసర్‌గా నియమించింది. ఆ తర్వాత కలకత్తా విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనూ విధులు నిర్వహించారు. నాలుగు దశాబ్దాల పాటు ఉపాధ్యాయవృత్తిలో ఉండి విద్యార్థుల మధ్యనే గడిపారు. ఎదుటివారికి బోధించటం వల్ల, తన విజ్ఞానం కూడా వృద్ధి చెందుతుందని బాగా నమ్మిన వ్యక్తి. వేలాది మంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఆయన తర్కం లాంటి కష్టమైన అంశాన్ని కూడా విద్యార్థులకు సులభంగా బోధించేవారు. ఆధునిక కాలంలో విద్యార్థికీ, ఉపాధ్యాయుడికీ మధ్య సంబంధం ఎలా ఉండాలో కూడా ఆచార్య రాధాకృష్ణన్ జీవితం అనేక పాఠాలను నేర్పుతుంది. ఆచార్యుడిగా, ఉపకులపతిగా, దౌత్యవేత్తగా, స్వాతంత్ర భారతావని తొలి ఉపరాష్ట్రపతిగా, రెండో రాష్ట్రపతిగా అధిరోహించిన శిఖరాలు, ఆయన జీవితంలోని అసాధారణ కోణాలను తెలియజేస్తున్నాయి. చదువులో చురుకుగా ఉండే సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు తల్లితండ్రులు ఉపనయనం చేశారు. ఇందులో భాగంగా ఆయన చెవులకు పోగులు పెట్టారు. ఇది జరిగిన అనంతరం తను చదువుకునే ఊరికి తిరిగి నడిచి వస్తున్నారు. పరీక్షకి రుసుం చెల్లించటానికి అదే చివరి రోజు. అలా వస్తున్న రాధాకృష్ణన్ ఒక దొంగ అడ్డగించి, దాడిచేసి చెవి పోగులు లాక్కున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో హడలిపోయిన సర్వేపల్లికి ఒళ్ళునొప్పులు, జ్వరం వచ్చింది. దీంతో పరీక్ష ఫీజు విషయం మర్చిపోయి పాఠశాలకు కూడా వెళ్లకుండా నిద్రపోయారు. ఇదే సమయంలో పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులు ఎవరైనా ఉన్నారా? అని ప్రధానోపాధ్యాయుడు పరిశీలించారు. అందులో రాధాకృష్ణన్ పేరు చూసి, "అయ్యో! చాలా బాగా చదువుకునే విద్యార్థి ఈరోజు రాకపోవడమేంటి? అని పరీక్ష రుసుం ఆయనే చెల్లించారు. ఆ తరువాత రాధాకృష్ణన్ పరీక్షల్లో తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఉపాధ్యాయుడంటే ఎలా ఉండాలో చూసిన రాధాకృష్ణన్ ఈ సంఘటన తన జీవితంలో మర్చిపోలేదు. అందుకే ఒక ఉపాధ్యాయుడు ఒక వ్యక్తిని ఎంత ఎత్తుకు తీసుకెళ్లగలరో తెలుసుకుని, ఆచరించిన మహా పురుషుడు. అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన తత్వశాస్త్రవేత్త అయినా, రాష్ట్రపతి పదవిని అలంకరించినా, భారతరత్నను అందుకున్నా తన పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవం పరమ పవిత్రంగా చేయాలని కోరుకున్నారు. గురువు అంటే గు అంటే చీకటి, రువు అంటే వెలుగు నింపేవాడు.... అజ్ఞానం చీకట్లు తొలగించి, జ్ఞానజ్యోతిని వెలిగించేవాడని అర్థం. అందుకే భారతీయ పరంపర గురువుకు గొప్ప స్థానాన్ని కల్పించింది. ఆ గౌరవాన్ని నిలుపుకో వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేటి ఉపాధ్యాయులు సర్వేపల్లిని ఆదర్శంగా తీసుకుని, బాలలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి. సర్వేపల్లి ప్రత్యేకతలు.. రాధాకృష్ణన్‌ అద్వైత వేదాంతి. శంకరుల మాయావాదాన్ని యథాతథంగా స్వీకరించలేదు. తన సొంత భాష్యం రాశారు. ఆయన రచనలు హిందూ ధర్మానికి పునరుద్దీపన కలిగించాయి. దార్శనిక శాస్త్రాలను ఆధునిక అవసరాలకు అనుగుణంగా మలచిన ఘనత సర్వేపల్లికే దక్కుతుంది. సర్వేపల్లి గొప్ప మానవతావాది. ప్రతి మానవుడూ అతడి మతమేదైనా, సాంఘిక స్థితిగతులేమైనా పరమేశ్వరుడి రూపంలో పుట్టినవాడే అని నమ్మేవారు. ప్రతి మనిషీ ఆ ఈశ్వరుడికి ప్రియపుత్రుడిగా రాణించగల నిగూఢ శక్తులతో జన్మించినవాడేనని ఆయన అభిప్రాయం. సర్వేపల్లి దృష్టిలో మతం అంటే - శక్తి, సంపదల కోసం కాకుండా.. శాంతి కోసం, సత్యం కోసం నిత్యాన్వేషణ. మతం అనేది సర్వసంగ పరిత్యాగం, ప్రారబ్ధానికి తలొగ్గడమూ కాదు. ధీరోదాత్తంగా సాగిపోవడమే మతం. ప్రస్థాన త్రయానికి ఆంగ్లంలో ఆధునిక దృష్టితో భాష్యం రాశారు సర్వేపల్లి. సోక్రటీస్‌ మొదలుకొని పాశ్చాత్య దార్శనికవేత్తల వరకు అందరి రచనలూ ఆయనకు కంఠోపాఠమే. భగవద్గీతను చదివినంత శ్రద్ధాసక్తులతో బైబిల్‌ చదివారు సర్వేపల్లి. ఖురాన్‌ ఆయనకు కొట్టిన పిండి. సూఫీ తత్వాన్నీ మధించారు. సర్వమతాలవారూ ఇతర మతాల పట్ల విశాలమైన, ఉదారమైన దృక్పథాన్ని అవలంబించాలని సర్వేపల్లి ప్రబోధించారు. ఎవరైనా ఇతర మతాలను, సంస్కృతులను విమర్శించడాన్ని ఆయన అంగీకరించేవారు కారు. మతం కాలానుగుణంగా మార్పు చెందుతుందన్న విషయం మరచిపోరాదని రాధాకృష్ణన్‌ అనేవారు. ఉపనిషత్తుల ఉపదేశాలు, బుద్ధుడి బోధనలు, గీతా సందేశం ప్రాతిపదికగా జాతీయ జీవనాన్ని తిరిగి నిర్మించుకోవాలని సందేశం ఇచ్చారు. సమాజంలో పండితులేగాని నిజమైన తత్వవేత్తలు కనిపించడం లేదని, సృజనాత్మకత కొరవడిందని సర్వేపల్లి ఆవేదన వ్యక్తం చేసేవారు. వారసత్వ సంపద ఎవరినీ మానసిక దాస్యానికి గురిచేయకూడదని మన మహర్షులు కూడా హితవు పలికారని.. అలా వారు నూతన సత్యాలు కనుగొనడానికి, అలాంటి పరిష్కారాలనే సూచించడానికి ఆసక్తి కనబరిచారని వివరించారు. తత్వవేత్తలుగా ప్రసిద్ధి చెందినవారెవరూ రాధాకృష్ణన్‌ పనిచేసినన్ని రంగాల్లో ప్రవేశించి ఉండరు. ఆయన పాలనాదక్షుడు, రాజనీతిజ్ఞుడు. అన్నింటినీ మించి.. ప్రాచ్య పాశ్చాత్య దేశాల్లో భారతీయ సంస్కృతికి ప్రతినిధిగా వ్యవహరించగలిగిన ప్రజ్ఞాధురీణుడు. తత్వశాస్త్రాన్ని వర్తమాన పరిస్థితులకు అన్వయించడమే కాకుండా ప్రపంచమంతటికీ వర్తింపజేసిన మేటి రాధాకృష్ణన్‌. ఆయన పర్యటించని ప్రదేశం లేదు. ఆయనను గౌరవించని స్థలం లేదు. సర్వేపల్లి ప్రబోధాలు.. ‘మతం ఆదర్శం - ఆధ్యాత్మిక సంబంధమైన అంతర దృష్టిని పొందడం. దీనికి మార్గమే నైతిక జీవనం, ధ్యానం’ ‘తత్వవేత్త జ్ఞానాన్ని ప్రేమించేవాడేగానీ జ్ఞాని కాడు.. యాత్ర ముగించడం ముఖ్యం కాదు, యాత్ర చేయడమే ముఖ్యం’ ‘విద్యార్థి జీవితాన్ని మలిచేది గురువే’


By September 04, 2021 at 09:37AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/history-and-importance-of-national-teachers-day-doctor-sarvepalli-birth-anniversary-in-telugu/articleshow/85918137.cms

No comments