Breaking News

Punjab Crisis సిద్ధూను వదిలిపెట్టను.. ఏ త్యాగానికైనా సిద్ధం: అమరీందర్ శపథం!


కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలపై పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమరీందర్ మాట్లాడుతూ.. రాహుల్‌, ప్రియాంకలకు రాజకీయ అనుభవం లేదని అన్నారు. అలాగే, వచ్చే ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు ఓటమే లక్ష్యంగా పనిచేసి, అతడిపై బలమైన అభ్యర్థిని నిలబెడతానని అన్నారు. ఈ విషయంలో ఎంతవరకైనా వెళతానని మాజీ సీఎం శపధం చేశారు. ‘రాహుల్‌ గాంధీ, ప్రియాంక నా పిల్లల్లాంటి వాళ్లు.. నన్ను అవమానకరంగా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించారు.. ఇది నన్ను తీవ్రంగా కలచివేసింది.. ఎమ్మెల్యేలను నేను విమానాల్లో గోవా లేదా ఇతర ప్రాంతాలకు తరలించలేదు. అది నా విధానం కాదు.. అనుభవం లేని రాహుల్, ప్రియాంకలను వారి సలహాదారులు తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని ఆయన విమర్శించారు. వచ్చే ఏడాది జరిగే పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నవజోత్‌ సింగ్‌ సిద్ధూపై బలమైన అభ్యర్థిని పోటీకి దింపుతానని అన్నారు. సిద్ధూ జాతి వ్యతిరేక శక్తి, ప్రమాదకరమైన వ్యక్తి అని అమరీందర్‌ ఆరోపించారు. ప్రమాదకరమైన వ్యక్తి సిద్ధూకు పంజాబ్‌ ముఖ్యమంత్రి అభ్యర్ధిత్వం దక్కకుండా చేయడమే తన లక్ష్యమని, అందుకోసం పోరాటం సాగుతుందన్నారు. అంతేకాదు, సిద్ధూ లాంటి ప్రమాదరకమైన వ్యక్తుల నుంచి దేశాన్ని కాపాడడానికి ఎలాంటి త్యాగాలకైనా తాను సిద్ధంగా ఉన్నానని అమరీందర్ తేల్చిచెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధూను ఓడిస్తానని ప్రతిజ్ఞ‌ చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించిన తర్వాత వేరేవారిని ముఖ్యమంత్రి చేయాలని సోనియా గాంధీ కోరినా ఆమె పట్టించుకోలేదన్నారు. నా అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశాన్ని కూడా రహస్యంగా నిర్వహించారని అన్నారు. సన్నిహితులు, అనుచరులతో చర్చించిన తర్వాత తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానన్నారు. తనకు వయసు అనేది ఒక అడ్డంకి కాదని చెప్పారు. తాను ఏడుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యానని గుర్తుచేశారు.


By September 23, 2021 at 11:42AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/will-sacrifice-anything-to-stop-sidhu-from-becoming-cm-says-captain-amarinder-singh/articleshow/86448151.cms

No comments