Breaking News

Modi US Tour భారత్-అమెరికా సహజ భాగస్వాములు.. మీరు ఇండియాకు రావాలి.. కమలాకు మోదీ ఆహ్వానం


అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో తొలిసారి సమావేశమయ్యారు. వైట్‌హౌస్‌లో జరిగిన ఈ సమావేశంలో పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత్‌- అమెరికా సహజ భాగస్వాముని అన్నారు. రెండూ అతిపెద్ద, పురాతన ప్రజాస్వామ్యమైన దేశాలని, ఒకే రకమైన విలువలు, భౌగోళిక రాజకీయ ప్రయోజనాలు కలిగి ఉన్నాయని మోదీ పేర్కొన్నారు. దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో సహకరించినందుకు అమెరికాకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా గెలవడం చారిత్రాత్మకమని.. ప్రపంచానికి ఆమె ఓ స్ఫూర్తి అని కొనియాడారు. బైడెన్‌- కమలా నేతృత్వంలో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నత స్థానానికి చేరుకుంటాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరుదేశాల మధ్య సమన్వయం, సహకారం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కమలా హ్యారిస్‌ను ప్రధాని మోదీ భారత్‌కు ఆహ్వానించారు. కోవిడ్ రెండో దశ వ్యాప్తి సమయంలో అమెరికా ప్రభుత్వం, యూఎస్‌కు చెందిన సంస్థలు, భారతీయ సంతతి ఎంతో సహాయం చేసిందని అన్నారు.‘బైడెన్, కమలా బాధ్యతలు చేపట్టే సమయానికి భూ ప్రపంచం అత్యంత క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటోంది.. అతి తక్కువ సమయంలోనే చాలా లక్ష్యాలను చేరుకున్నారు.. అవి కోవిడ్-19, వాతావరణ మార్పులు లేదా క్యాడ్ వంటివి’ అని మోదీ కితాబిచ్చారు. కమలా హ్యారిస్‌ మాట్లాడుతూ.. అమెరికాకు భారత్‌ ప్రత్యేక భాగస్వామి అని ఆమె అన్నారు. వ్యాక్సిన్ ఎగుమతుల పునురుద్ధరణపై భారత్‌ చేసిన ప్రకటనను ఆమె స్వాగతించారు. కోవిడ్-19 ప్రారంభంలో టీకాలకు భారత్‌ ప్రధాన వనరుగా ఉందన్నారు. అంతేకాదు, కోవిడ్ రెండో దశ విజృంభణ సమయంలో భారత్‌కు సహకరించినందుకు గర్వంగా ఉందని కమలా వ్యాఖ్యానించారు. భారత్‌లో రోజుకు కోటి మందికి టీకా వేస్తున్నారని తెలిపారు. ప్రపంచంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రమాదంలో ఉన్నాయని కమలా హారిస్‌ అన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత ఇరు దేశాలపై ఉందని తెలిపారు.


By September 24, 2021 at 07:09AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/us-and-india-natural-partners-bilateral-ties-will-touch-new-heights-pm-invites-kamala-harris-to-india/articleshow/86469552.cms

No comments