Breaking News

Kashmir Issue ఐరాసలో టర్కీ అధినేత నీతి వాక్యాలు.. దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన భారత్


కోవిడ్-19 అంతం, ఉగ్రవాద నిర్మూలన, వాతావరణ మార్పులు సహా పలు సమస్యలకు నిర్మాణాత్మక పరిష్కారాల కోసం యావత్‌ ప్రపంచం దృష్టి సారిస్తే.. టర్కీ, పాకిస్థాన్‌ మాత్రం ఇంకా కాలం చెల్లిన డిమాండ్లనే పట్టుకుని వేలాడుతున్నాయి. కరోనా వ్యాక్సినేషన్‌, అఫ్గన్‌ సంక్షోభం తర్వాత అంతర్జాతీయ సంబంధాలు, ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం వంటి గంభీరమైన అంశాల మధ్య ఐరాస సర్వసభ్య సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే, గత ఏడాది వర్చువల్‌ సమావేశాల్లో మాదిరిగానే టర్కీ అధినేత వ్యవహరించారు. తాజాగా, కశ్మీర్ అంశాన్ని ఎర్డోగన్‌ మరోసారి లేవనెత్తి పాక్‌కు వంతపడారు. గతేడాది ఇదే అంశాన్ని టర్కీ ప్రస్తావించగా.. భారత్‌ అప్పుడే చురకలంటించింది. భారత అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చొద్దని గట్టిగానే హెచ్చరించింది. అయినా, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ తీరు మాత్రం మారలేదు. 74 ఏళ్లుగా కొనసాగుతున్న కశ్మీర్‌ సమస్యను పరిష్కరించాలని సాధారణ సభ సమావేశంలో మంగళవారం నాటి తన ప్రసంగంలో ఎర్గోగన్ పేర్కొన్నారు. చర్చల ద్వారా, ఐరాస నిబంధనలకు అనుగుణంగా ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదుర్చాలంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమన్న విషయంపై అవగాహన లేకుండా మాట్లాడిన ఎర్డోగన్‌కు భారత విదేశాంగ మంత్రి జయశంకర్ కౌంటర్ ఇచ్చారు. సైప్రస్ అధ్యక్షుడు క్రిస్టో‌డౌల్డీస్‌తో బుధవారం సమావేశమైన మంత్రి జయశంకర్.. ఐలాండ్ దేశానికి సంబంధించి ఐరాస భద్రతా మండలి తీర్మానాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ‘మా ఆర్థిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నాం.. ప్రాంతీయ సంబంధాలను ప్రశంసించారు.. సైప్రస్‌కు సంబంధించి భద్రతా మండలి తీర్మానాలు అందరూ పాటించడం ముఖ్యం’ అంటూ టర్కీకి పరోక్షంగా జయశంకర్ చురకలంటించారు. సైప్రస్, టర్కీ మధ్య సుదీర్ఘకాలం నుంచి వివాదం కొనసాగుతోంది. టర్కీ 1974లో సైన్యాలతో దాడి చేసి, ఆ తర్వాత టర్కిష్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ నార్తర్న్‌ సైప్రస్‌ ఏర్పాటు చేసింది. సైప్రస్‌ విషయంలో గ్రీస్‌, టర్కీ దేశాల మధ్య వివాదం నడుస్తోంది. ప్రస్తుత టర్కీ విధానాలు పాత ఒటోమన్‌ సామ్రాజ్యపు విధానాలను పోలి ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు ఎర్దోగన్ దేశ సరిహద్దులను మరింత విస్తరించాలని కోరుకుంటున్నారు. ప్రచ్ఛన్నయుద్ధం తర్వాత టర్కీ తన వైఖరినీ క్రమంగా మార్చుకుంటూ వచ్చింది. లౌకిక రాజ్యం నుంచి ఇస్లామిక్‌ స్టేట్‌ దిశగా దేశ నాయకత్వం అడుగులు వేస్తోంది.


By September 23, 2021 at 08:10AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-counter-to-turkey-hours-after-mentions-kashmir-issue-in-unga-speech/articleshow/86444723.cms

No comments