Breaking News

Karnataka 500 ఏళ్ల చరిత్ర కలిగిన మఠానికి అధిపతిగా 13 ఏళ్ల బాలుడు!


కర్ణాటకలోని కుప్పూరు గడ్డుగే సంస్థాన మఠాధిపతిగా 13 ఏళ్ల బాలుడ్ని ఎంపిక చేశారు. ఈ మఠం అధిపతిగా వ్యవహరించిన శనివారం శివైక్యం చెందడంతో ఆయన వారసుడిగా తేజస్ కుమార్‌ను నియమించారు. తుముకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలూకాలో ఈ మఠం ఉంది. యతీశ్వర శివాచార్య పరమపదించడానికి ముందే తేజస్‌ను వారసునిగా పేర్కొన్నారు. మఠాధిపతి అంత్యక్రియలు నిర్వహించేందుకు వారసుడు తప్పనిసరి. దీంతో కర్ణాటక న్యాయ శాఖ మంత్రి జేసీ మధుస్వామి, ఇతర మఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తల సమక్షంలో ఈ పేరును ప్రకటించారు. కొత్త మఠాధిపతి చేతుల మీదుగా యతీంద్ర శివాచార్య అంత్యక్రియలు జరిపించారు. తేజస్‌ కుమార్‌ 2008, ఏప్రిల్‌ 22న జన్మించారు. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న ఆయన.. మైసూరు సుత్తూరు మఠంలో తన విద్యాభ్యాసాన్ని కొనసాగించే అవకాశముంది. కర్ణాటక న్యాయ శాఖ మంత్రి జేసీ మధు స్వామి మీడియాతో మాట్లాడుతూ.. యతీశ్వర శివాచార్య స్వామి ఆకాంక్షల మేరకు పదమూడేళ్ల బాలుడు తేజస్‌ను తదుపరి మఠాధిపతిగా నియమించినట్లు తెలిపారు. 500 సంవత్సరాల చరిత్రగల వీరశైవ మఠాన్ని తన తర్వాత తన మేనల్లుడు నడిపిస్తాడని యతీశ్వర శివాచార్య స్వామి చెప్పారని అన్నారు. అర్చకుడు బీఆర్ గిరీశ్ మాట్లాడుతూ.. కామ సముద్రలోని ఓ ప్రైవేటు పాఠశాలలో తేజస్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడని తెలిపారు. మఠాధిపతిగా విధులను నిర్వహిస్తూనే తేజస్ చదువును కొనసాగిస్తాడని చెప్పారు. ఈ మఠానికి చెందిన మహేశ్, కాంతామణి దంపతుల కుమారుడైన తేజస్ కుమార్.. మఠాధిపతిగా బాధ్యతలను స్వీకరించేందుకు అంగీకరించినట్లు మఠం అధికారులు, కుటుంబ సభ్యులు చెప్పారు. 500 ఏళ్ల నుంచి ఒకే కుటుంబానికి చెందినవారు ఈ మఠానికి అధిపతులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యతీశ్వర శివాచార్య స్వామి కోవిడ్-19 బారినపడటంతో చికిత్స కోసం తుమకూరులోని సిద్ధ గంగ ఆసుపత్రిలో చేరారు. ఆయన శనివారం రాత్రి గుండెపోటు రావడంతో పరమపదించారు.


By September 28, 2021 at 10:06AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/karnataka-13-year-old-boy-new-head-of-kuppuru-gadduge-mutt-in-tumakuru/articleshow/86575559.cms

No comments