Breaking News

eswar: సీనియర్ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ కన్నుమూత


సీనియ‌ర్ ప‌బ్లిసిటీ డిజైన‌ర్ ఈశ్వ‌ర్ అనారోగ్యంతో ఈరోజు(మంగ‌ళ‌వారం) ఉద‌యం చెన్నైలోని త‌న ఇంట్లో క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 84 సంత్స‌రాలు. ఎన్నో చిత్రాల‌కు చ‌క్క‌టి పోస్ట‌ర్స్‌ను త‌యారు చేసి ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌గా త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్నారు. బాపు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సాక్షి సినిమాతో ప‌బ్లిసిటీ ప‌నులు స్టార్ట్ చేశారు. ఈ సినిమా క‌ల‌ర్ పోస్ట‌ర్స్‌, లోగోను ఈశ్వ‌ర్ రూపొందించారు. నైఫ్ వ‌ర్క్‌తో పోస్ట‌ర్స్‌ను రూప‌క‌ల్ప‌న చేసి త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. ఈశ్వ‌ర్‌ ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పాల‌కొల్లులో జ‌న్మించారు. వంశ పార‌ప‌ర్యంగా వ‌స్తున్న బొమ్మ‌లు గీసే వృత్తిలోకి ఆయ‌న ప్ర‌వేశించారు. బొమ్మ‌లు గీయ‌డంలో ఉండే ఆస‌క్తితో కాకినాడ పాలిటెక్నిక్ చ‌దువును ఆపేశారు. పబ్లిసిటీ ఆర్టిస్ట్‌గా స్థిర‌ప‌డాల‌నే స్నేహితుడు స‌హాయంతో మ‌ద్రాసు చేరుకున్నారు. మ‌ద్రాసు చేరుకున్న త‌ర్వాత కేతా వ‌ద్ద పోస్ట‌ర్ డిజైనింగ్‌లో మెళుకువ‌లు నేర్చుకున్నారు. త‌న పేరు ఈశ్వ‌ర్‌తోనే ప‌బ్లిసిటీ కంపెనీని స్టార్ట్ చేశారు. సినిమా పోస్ట‌ర్ స‌హా ప‌బ్లిసిటీ డిజైనింగ్‌కు సంబంధించి ప‌లు పుస్త‌కాల‌ను ర‌చించారు ఈశ్వ‌ర్‌. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ,హిందీ భాషల్లో 2600లకు పైగా చిత్రాలకు పని చేశారు. విజయా , ఏవీయం, జెమినీ, అన్నపూర్ణ, గీతా ఆర్ట్స్, సురేష్ ప్రొడక్షన్స్ , వైజయంతి తదితర అగ్ర నిర్మాణ సంస్థలకు ఆయన పబ్లిసిటీ డిజైనర్‌గా పని చేశారు. పలు ప్రముఖ నిర్మాణ సంస్థల లోగోలను ఆయన డిజైన్ చేశారు. 'దేవుళ్ళు' ఆయన పని చేసిన ఆఖరి చిత్రం. ఈశ్వర్ గారి సహకారంతోనే ఆయన సోదరులు బ్రహ్మం అనూ గ్రాఫిక్స్ కోసం తెలుగు ఫాంట్ లను రూపొందించారు. ఈశ్వర్ రాసిన 'సినిమా పోస్టర్' పుస్తకానికి ఉత్తమ సినిమా గ్రంథ రచన విభాగంలో 2011లో నంది పురస్కారం లభించింది. చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను 2015లో ఆయన్ను రఘుపతి వెంకయ్య పురస్కారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్కరించింది. ఆయన భార్య పేరు వరలక్ష్మి. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు .


By September 21, 2021 at 09:07AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/senior-publicity-designer-eswar-passed-away/articleshow/86387295.cms

No comments