మహిళా ఉద్యోగులపై నిషేధం.. ఆఫీసు లోపలి రాకుండా ఆపేసిన తాలిబన్లు
మహిళలు కేవలం పిల్లల్ని కని పెద్దచేయడానికే పరిమితమని ప్రకటించి ఎప్పటి మాదిరిగానే తమ బాణీ మారలేదని తాలిబన్లు నిరూపించుకున్నారు. తాజాగా, మహిళా ఉద్యోగులను కార్యాలయాలకు అనుమతించని ఘటన చోటుచేసుకుంది. మహిళా వ్యవహారాల శాఖ కార్యాలయంలోకి కేవలం పురుష ఉద్యోగులను మాత్రం అనుమతిస్తున్నారని ఆ విభాగానికి చెందిన అధికారి ఒకరు తెలిపారు. మహిళా ఉద్యోగులను కార్యాలయంలోకి అనుమతించకపోవడంతో దీనికి వ్యతిరేకంగా అక్కడే ఆందోళనకు దిగారు. అఫ్గన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో అక్కడ మహిళల భవిష్యత్తుపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. రెండు దశాబ్దాల కిందట వారి అరాచక పాలనను గుర్తుచేసుకుంటున్న ప్రజలు.. భయంతో వణికిపోతున్నారు. మహిళలు ఉద్యోగాలు చేయడం ఇస్లామిక్ చట్టాలకు వ్యతిరేకమని భావించిన తాలిబన్లు.. గతంలో కఠిన షరియాను అనుసరించారు. అమెరికా సైన్యం వెనుదిరిగిన తర్వాత అఫ్గన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు.. పది రోజుల కిందట తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఇస్లామ్‌కి అనుగుణంగా మహిళల హక్కులను కల్పిస్తామని తాలిబన్లు ప్రకటించారు. అంతేకాదు, ప్రభుత్వంలోనూ మహిళలు, మేధావులను భాగస్వాములను చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఆ హామీలన్నీ నూటమాటలేని తేలిపోయింది. ‘ఇస్లాం పరిధిలో మహిళల హక్కుల కల్పనకు తాలిబన్లు కట్టుబడి ఉన్నారు.. ఆరోగ్య విభాగంలో మహిళలు పనిచేయవచ్చు.. అవసరమైతే మిగతా రంగాల్లో అవకాశం ఉంటుంది.. మహిళల పట్ల ఎటువంటి వివక్షత లేదు’ అని అధికార ప్రతినిధి జబిబూల్లా ముజాహిద్దీన్ ప్రకటించారు. అయితే, ఈ ప్రకటన చేసిన కొద్ది రోజులకే మహిళంటే కేవలం పిల్లల్ని కనడానికి మాత్రమేనని, వారు పదవులు చేపట్టడానికి పనికిరారంటూ తాలిబన్లు తమ సహజ లక్షణాన్ని బయటపెట్టుకున్నారు. అఫ్గన్‌లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో మహిళలకు చోటుదక్కకపోవడంపై పలుచోట్ల మహిళలు నిర్వహిస్తున్న ఆందోళనను పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఎవరో కొందరు ఆందోళన చేస్తే అఫ్గన్ మహిళలందరూ తరఫున చేసినట్టు కాదని తాలిబన్ అధికార ప్రతినిధి సయ్యద్ జక్రూల్లా హషీమ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘క్యాబినెట్‌లో మహిళ అవసరం లేదు.. ఒక మహిళ మంత్రి అయితే.. ఆమె మెడపై మోయలేని భారం ఉంచినట్లుగా ఉంటుంది.. ఇస్లామిక్ నిబంధనలకు ప్రకారం పిల్లలను కనడం..పెంచడం వారి విధి.. నిరసనలు చేస్తున్నవారు అఫ్గన్‌లో మహిళలందరికీ ప్రాతినిధ్యం వహించినట్టు కాదు’ అని టోలో న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
By September 17, 2021 at 10:28AM
No comments