ఉగ్రవాదంలో పాక్ ఘన చరిత్ర ప్రపంచ మొత్తానికి తెలుసు.. ఐరాసలో భారత్ దిమ్మదిరిగే కౌంటర్
ఐక్యరాజ్యసమితి వేదికగా ఉగ్రవాదం విషయంలో మరోసారి దాయాది పాకిస్థాన్‌ను భారత్ కడిగిపారేసింది. సాధారణ సభ సమావేశంలో కశ్మీర్ అంశాన్ని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తావించడంతో భారత్ దీటుగా కౌంటర్ ఇచ్చింది. భారీ సంఖ్యలో ఐరాస నిషేధిత జాబితాలోని ఉగ్రవాదులకు పాక్ ఆతిథ్యం ఇస్తోందని ఆరోపించిన భారత్.. దీనికి కశ్మీర్‌లో పరిస్థితులను ఉదహరించింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటనకు సమాధానం ఇచ్చే హక్కును వినియోగించుకున్న భారత్. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, సాయం చేయడం, మద్దతునివ్వడంలో ఘనమైన చరిత్ర, విధానాలు పాక్ సొంతమని దుయ్యబట్టింది. ఐరాస సాధారణ సభలో భారత తొలి కార్యదర్శి స్నేహా దూబే మాట్లాడుతూ.. ‘ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గుర్తించిన అనేక మంది ఉగ్రవాదులకు ఆతిథ్యం ఇవ్వడంలో పాకిస్థాన్‌ది ఘనమైన చరిత్ర.. ఒసామా బిన్ లాడెన్‌కు పాక్ ఆశ్రయమిచ్చింది.. అంతేకాదు, ఉగ్రవాదులను అమర వీరులుగా పాక్ నాయకత్వం నేడు కీర్తిస్తోంది’ అని అన్నారు. అంతేకాదు, ‘తమ దేశానికి వ్యతిరేకంగా నిరాధార ఆరోపణలు, హానికరమైన ప్రచారానికి ఐరాస వేదికను పాక్ ఉపయోగించుకోవడం ఇదే తొలిసారి కాదు.. ఆ దేశాధినేతలు ఈ వేదికను దుర్వినియోగం చేస్తున్నారు.. ఉగ్రవాదులకు స్వర్గంగా మారడం వల్ల సాధారణ ప్రజలు, ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు చెందిన వారి జీవితాలు తల్లకిందులు కావడంతో ప్రపంచం దృష్టిని మరల్చడానికి భారత్‌పై ఇటువంటి ఆరోపణలు చేస్తోంది’ అని వ్యాఖ్యానించారు. ‘ఉగ్రవాదులకు మద్దతివ్వడం, సహకరించడం, ఆశ్రయం కల్పించడంలో పాత్ర గురించి ఐరాసలో సభ్యదేశాలకు తెలుసు.. బహిరంగంగా ఉగ్రవాదులకు మద్దతు, శిక్షణ, ఆర్ధిక, ఆయుధాలు సమకూర్చడమనేది ప్రభుత్వ విధానంగా పెట్టుకున్న ఏకైక దేశం పాక్ అనేది ప్రపంచం గుర్తించింది.. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిషేధిత ఉగ్రవాదులకు పెద్ద సంఖ్యలో ఆతిథ్యం ఇచ్చిన ఘనమైన చరిత్ర ఆ దేశానిది’ అని ఇమ్రాన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
By September 25, 2021 at 09:26AM
No comments