భీమ్లా నాయక్ అప్డేట్.. డేనియల్ శేఖర్ ఎంట్రీ అప్పుడే!
అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాకు వచ్చిన టాక్ అంతా ఇంతా కాదు. ఇద్దరు జగమొండి, ఇగో ఉన్న వ్యక్తుల మధ్య జరిగే కథ ఇది. అయితే దాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి అంటూ తెరకెక్కిస్తున్నారు. మాతృక సినిమాలో టైటిల్ నుంచి ప్రతీ ఒక్క విషయంలో రెండు పాత్రలకు న్యాయం చేశారు. బిజూ మీనన్, పృథ్వీరాజ్ సుకుమారన్‌లలో ఏ ఒక్కరినీ తక్కువ చేయలేదు.. ఏ ఒక్కరికీ హైప్ ఇవ్వలేదు. రెండు పాత్రలు మాత్రమే తెరపై కనిపిస్తాయి. కానీ తెలుగులోకి వచ్చేసరికి టైటిల్‌లోనే ఓ పాత్ర ఎగిరిపోయింది. భీమ్లా నాయక్ అంటూ పేరుతోనే సినిమాను రెడీ చేస్తున్నారు. అంటే ఇది పవన్ కళ్యాణ్ సినిమా కాకుండా కేవలం పవర్ స్టార్ సినిమాగానే మిగిలిపోనుందని అర్థమవుతోంది. ఈక్రమంలో భీమ్లా నాయక్ అంటూ వదిలిన ఫస్ట్ గ్లింప్స్, భీమ్లా నాయక్ వ్యక్తిత్వాన్ని కీర్తిస్తూ వదిలిన పాటను చూస్తే ఈ రీమేక్ ఎలా ఉండబోతోందో ఓ అంచనాకు రావొచ్చు. అయితే డేనియల్ శేఖర్ పాత్రలో రానా కనిపించనున్నాడు. మరి ఈ పాత్రకు హద్దులు ఎలా గీశారు.. ఎంత వరకు రానా పాత్రను ఉంచారు.. ఎలా మలిచారు? అనే సందేహాలు సినీ అభిమానుల్లో ఉన్నాయి. వాటిపై ఓ క్లారిటీ రానుంది. సెప్టెంబర్ 20న డేనియల్ శేఖర్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. రానా పాత్రకు సంబంధించిన టీజర్‌ను వదలనున్నారు. మరి అందులో రానా ఏ మేరకు కనిపిస్తాడు.. మెప్పిస్తాడు అన్నది చూడాలి.
By September 18, 2021 at 02:20AM
No comments