Breaking News

తాలిబన్లు ఎక్కువ కాలం పాలించడం కష్టమే.. ప్రముఖ చరిత్రకారుడు సంచలన వ్యాఖ్యలు


అఫ్గనిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకుని తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, వారి ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాగించడం కష్టమేనా? అంటే అవునంటున్నారు ప్రముఖ రచయిత, చరిత్రకారుడు విలియం డాల్రింపుల్‌. 2012లో బ్లూమ్స్‌బరీ విడుదల చేసిన‘రిటర్న్‌ ఆఫ్‌ ఏ కింగ్‌: ది బ్యాటిల్‌ ఫర్‌ అఫ్గనిస్థాన్‌’ పుస్తక రచయిత విలియం డాల్రింపుల్‌.. తాలిబన్ల ప్రభుత్వం, ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులపై పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మార్పునకు అంగీకరించని మనస్తత్వం కలిగిన వయసుపైబడిన ముల్లాలు ఏర్పాటు చేసిన ‘అసమ్మిళిత అద్భుతమైన’ ప్రభుత్వంగా ఆయన అభివర్ణించారు. అఫ్గన్‌ ప్రజల మనసులను గెలవలేని తాలిబన్లు.. అన్ని వర్గాలను కలుపుకుపోయే ప్రయత్నం కూడా చేయలేదని డాల్రింపుల్‌ అభిప్రాయపడ్డారు. సమ్మిళిత ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ ప్రటించిన తాలిబన్లు.. హమీద్‌ కర్జాయ్ వంటి మాజీ అధ్యక్షుడు లేదా గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వలేకపోయారని వ్యాఖ్యానించారు. ‘ఇప్పటివరకు అఫ్గన్‌ను విజయవంతంగా నడిపించిన ప్రభుత్వాలు అన్ని వర్గాలను కలుపుకుని పాలించే ప్రయత్నం చేశాయి. కానీ, ప్రస్తుతం ప్రభుత్వం మాత్రం 60 శాతంగా ఉన్న అఫ్గన్లు, దేశంలో 50 శాతం ఉన్న మహిళలను మెప్పించలేపోతుంది... తాలిబన్లకు మూలమైన పష్తున్‌లు కేవలం 40 శాతం మాత్రమే’అని ఆయన గుర్తుచేశారు. ముఖ్యంగా అక్కడి జనాభాలో సగం ఉన్న మహిళలకు కూడా భరోసా కల్పించలేకపోతున్నారని డాల్రింపుల్‌ పేర్కొన్నారు. క్యాబినెట్‌లో అందరూ పురుషులూ ఉండడం ఇందుకు నిదర్శనమన్నారు. ఇదీ ఒక విధంగా మంచి పరిణామమేనని.. ఎందుకంటే ఇలాంటి ప్రభుత్వం అఫ్గనిస్థాన్‌ను విజయవంతంగా పాలించే అవకాశం లేదని డాల్రింపుల్‌ జోస్యం చెప్పారు. అఫ్గన్‌ విషయంలో భారత్‌ పాత్ర ఎలా ఉండబోతుందని అడిగిన ప్రశ్నకు ఆ విషయంలో తానేమీ వ్యాఖ్యానించదలుచుకోలేదని చెప్పారు. అఫ్గనిస్థాన్‌ ప్రభుత్వంలో ఇతర దేశాల మద్దతు గురించి మాట్లాడుతూ.. ఇప్పటివరకు అఫ్గన్‌ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయన్నారు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ, బ్రిటిష్‌ రాజ్‌, రష్యన్లు, తాజాగా అమెరికా కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ సాధించింది శూన్యమే. ‘ సింహాసనంపై ఏ పాశ్చాత్య శక్తి అయినా తోలుబొమ్మను ఉంచడం చాలా కష్టం.. చరిత్ర గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ జార్జ్ బుష్ (అమెరికా మాజీ అధ్యక్షుడు), టోనీ బ్లెయిర్ (యూకే మాజీ ప్రధాన మంత్రి) ముందుగానే ఇది చాలా కష్టమని హెచ్చరించారు. ఇందులో ఎటువంటి రహస్యం లేదు’ అన్నారు. అయితే, సుదీర్ఘ కాలంపాటు అఫ్గన్‌ అధ్యక్షుడిగా ఉన్న హమీద్ కర్జాయ్ పాలనలో కొంత మార్పునకు అవకాశం లభించింది. ‘గత తాలిబాన్ ప్రభుత్వం చాలా క్రూరమైన పాలన సాగించి, ప్రజాదరణ చూరగొనలేకపోయింది. తర్వాత అధికారం చేపట్టిన కర్జాయ్ పట్ల భారీ సానుకూలత ఉంది. అఫ్గనిస్థాన్ సుదూర ప్రాంతాల నుంచి గిరిజన నాయకులు వచ్చినప్పుడు ఆయన వారికి గొప్ప గౌరవం ఇస్తారు. ప్రజలను ముఖ్యమైన వారిగా భావించి వారి పక్షాన ఉంటారు’ అని అన్నారు. ‘అందర్నీ కలుపుకునే వెళ్లే స్వభావం కలిగిన కర్జాయ్.. హింసాత్మక పోరాటాన్ని వదిలిపెట్టి ప్రభుత్వంలోకి రావాలని తాలిబాన్లను నిరంతరం ప్రోత్సహించారు. అఫ్గన్‌లో కొంత మార్పునకు ఎవరైనా ప్రయత్నించారా అంటే అది కర్జాయే మాత్రమే.. అపారమైన మనోవిజ్ఞత కలిగిన వ్యక్తి.. కానీ ఎల్లప్పుడూ అలా ఉండటం కష్టంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. కానీ, తర్వాత వచ్చిన అష్రాఫ్ ఘనీ దానిని కొనసాగించలేకపోయారని తెలిపారు. ఆయన తనదైన శైలిలో విభజన రాజకీయాలను ప్రోత్సహించారని అభిప్రాయపడ్డారు. మీడియా సమావేశంలో ఓ మహిళా జర్నలిస్టుపై యాష్ ట్రే విసిరిన మూర్ఖపు చర్యలకు పాల్పడిన మనస్తత్వం ఆయనది అని విలియం డాల్రింపుల్‌ గుర్తుచేశారు. సంక్షోభ సమయంలో అఫ్గన్‌ నుంచి పారిపోవడం అఫ్రాఫ్‌ ఘనీకి మరింత సమస్యేనన్న ఆయన.. మరోసారి మాజీ అధ్యక్షుడు స్వదేశానికి వస్తాడని అనుకోవడం లేదని డ్రాలింపుల్ అంచనా వేశారు. అఫ్గన్‌ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణను రచయిత తప్పుబట్టారు. సైన్యా్ని ఉపసంహరించుకోవాలనే అమెరికా నిర్ణయం వ్యూహాత్మక తప్పిదమేనని విలియం డాల్రింపుల్‌ అభిప్రాయపడ్డారు. ఇక పాకిస్థాన్‌ నుంచి తాలిబన్లు నిధులు, శిక్షణ, ఆశ్రయం పొందారనడంలో ఎటువంటి సందేహం లేదన్న స్పష్టం చేశారు. అవసరమైతే వారికి ఆపన్నహస్తం అందించిన పాకిస్థాన్‌ నుంచే విముక్తి పొందేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.


By September 13, 2021 at 09:43AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/taliban-government-unlikely-to-survive-says-writer-william-dalrymple/articleshow/86158160.cms

No comments