Breaking News

నదిలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ఆరుగురు మృతి


ప్రయాణికులతో వెళ్తున్న బస్సు నదిలో పడి.. ఆరుగురు దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటన మేఘాలయలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. తురా నుంచి మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌కు బుధవారం రాత్రి బయలుదేరిన మేఘాలయ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు.. నాంగ్‌చోరమ్ వద్ద రింగ్డి నదిలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయానికి బస్సులో మొత్తం 21 మంది ప్రయాణికులున్నట్టు అధికారులు తెలిపారు. ప్రమాదంలో డ్రైవర్ సహా ఐదుగురు మృతిచెందినట్టు పేర్కొన్నారు. ప్రమాదం నుంచి 16 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఇప్పటి వరకూ నాలుగు మృతదేహాలను బయటకు తీయగా.. బస్సు లోపలి మరో రెండు మృతదేహాల చిక్కుకున్నాయి. ప్రమాదంలో గాయపడినవారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. నదిలో ప్రవాహం తక్కువగా ఉండటంతో ప్రాణనష్టం తక్కువగా ఉందని అధికారులు తెలిపారు. ప్రమాదం రాత్రివేళ జరగడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. క్రేన్ సాయంతో బస్సును నదిలో నుంచి లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


By September 30, 2021 at 10:23AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/six-dead-several-injures-after-bus-falls-into-river-in-meghalaya/articleshow/86635307.cms

No comments