Breaking News

కోవిడ్ రోగులు ఆత్మహత్య చేసుకున్నా పరిహారం.. కేంద్రంపై సుప్రీం ప్రశంసలు


మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపు విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం ప్రశంసించింది. కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చిన 30 రోజుల్లోపు ఆత్మహత్య చేసుకున్న బాధితుడి కుటుంబీకులూ పరిహారం పొందడానికి అర్హులేనని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకూ పరిహారం అందించే విషయాన్ని పునఃపరిశీలించాలని జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్నలతో కూడిన ధర్మాసనం సూచించిన నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు గురువారం అఫిడ్‌విట్ దాఖలుచేసింది. ‘‘కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్‌ జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం కొవిడ్‌ పాజిటివ్‌ అని తేలిన 30 రోజుల్లోపు ఆత్మహత్య చేసుకున్న బాధితుడి కుటుంబం రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) కింద పరిహారం పొందడానికి అర్హులే. ఈమేరకు కోర్టు తగిన ఉత్తర్వులు జారీచేయొచ్చు’’ అని సుప్రీంకోర్టుకు సమర్పించిన అదనపు అఫిడ్‌విట్‌లో కేంద్రం పేర్కొంది. ఇప్పటికే ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నుంచి కొవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.50వేల చొప్పున పరిహారం చెల్లించడానికి రాష్ట్రాలకు అనుమతిచ్చినట్లు కేంద్రం బుధవారం కోర్టుకు తెలిపింది. తాజాగా ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకూ వర్తించనుంది. ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి విషయంలో భారత్ వ్యవహరించినట్టు మరే దేశం చేసుండదని ప్రశంసించింది. ‘‘ఈ రోజు మాకు చాలా సంతోషంగా ఉంది.. కోవిడ్ కారణంగా ఆప్తులను కోల్పోయి బాధపడుతున్న వ్యక్తులకు ప్రభుత్వం చేస్తున్న పని కొంత ఊరట కలుగుతుంది.. బాధలో ఉన్న వ్యక్తి కన్నీళ్లను తుడిచేందుకు ఏదో ఒకటి చేస్తున్నందుకు మాకు సంతోషంగా ఉంది’ అని జస్టిస్ ఎంఆర్ షా వ్యాఖ్యానించారు. జస్టిస్ షా, జస్టిస్ ఏఎస్ బొపన్నలు రెండో దశ వ్యాప్తికి సంసిద్ధంగా లేకపోవడం, మెడికల్ ఆక్సిజన్ వంటి అత్యవసరాల కొరతతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన అంశంపై తీవ్ర పరిశీలన చేసి భారత్ ప్రతిస్పందనను ప్రశంసించారు. ‘మన జనాభా పరిమాణం, టీకా ఖర్చులు, ఆర్థిక పరిస్థితి, ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా ... మనం ఆదర్శప్రాయమైన చర్యలు తీసుకున్నాం.... భారతదేశం చేసిన పనిని మరే దేశం చేయలేకపోయింది’ అని అన్నారు.


By September 24, 2021 at 09:17AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/no-country-managed-to-do-what-india-did-sc-appreciated-centre-on-covid-steps/articleshow/86471151.cms

No comments