Breaking News

అనంత పద్మనాభుడి ఆదాయ, వ్యయాల ఆడిట్.. రాజ కుటుంబానికి సుప్రీం షాక్!


కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయ ఆదాయ, వ్యయాల విషయంలో సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీచేసింది. ఆలయ ఆదాయ, ఖర్చుల ఆడిట్‌ విషయంలో ట్రస్టుకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆలయంతో సహ ట్రస్టుకు సంబంధించి గత 25ఏళ్లలో జరిగిన లావాదేవీలు, ఆదాయాలపై ఆడిట్‌ (Audit)ను కచ్చితంగా నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. అంతేకాదు, దీనిని మూడు నెలల్లోనే పూర్తిచేయాలని గడువు విధించింది. పద్మనాభస్వామి ఆలయంలో గడిచిన 25ఏళ్ల ఆదాయ, వ్యయాలకు సంబంధించి ఆడిట్‌ నిర్వహించాలని సుప్రీంకోర్టు గతేడాది ఆదేశాలు జారీ చేసింది. దీనిని నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని ఆలయ ట్రస్టు సుప్రీంకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాల్లో కేవలం పూజలు, ఆలయ నిర్వహణ విషయాలు మాత్రమే పేర్కొన్నారని.. ట్రస్టు గురించి కాదని వివరించింది. కేవలం పూజలు, క్రతువుల్లోనే రాజకుటుంబం భాగస్వామ్యం ఉందని, నిర్వహణలో తమకు ప్రమేయం లేదని ట్రస్ట్ వాదించింది. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ యూయూ లలిత్‌, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ బీఎం త్రివేదిల త్రిసభ్య ధర్మాసనం.. ఆడిట్‌ కేవలం ఆలయానికి మాత్రమే పరిమితం కాదని వెల్లడించింది. ఇది ట్రస్టుకు కూడా వర్తిస్తుందని, ఆడిట్‌ను వీలైనంత త్వరగా సాధ్యమైతే మూడు నెలల్లోపే చేపట్టాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్వామివారికి వచ్చే ఆదాయం, ఆలయ నిర్వహణ ఖర్చులకే సరిపోవడం లేదని, తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ కమిటీ సుప్రీంకోర్టుకు తెలిపింది. ‘కేరళలో అన్ని ఆలయాలు మూతబడ్డాయి. పద్మనాభస్వామి ఆలయం నిర్వహణకు నెలకు రూ.1.25 కోట్ల ఖర్చు అవుతుంటే ఆదాయం మాత్రం రూ.60- 70 లక్షలు మాత్రమే వస్తోంది.. అందుకే ట్రస్టు నుంచి ఆర్థిక సహాయం అవసరం.. దీనిపై కొన్ని సూచనలు కోరుతున్నాం’ అని నిర్వహణ కమిటీ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అంతేకాదు ట్రస్ట్ వద్ద దాదాపు రూ.2.8 కోట్ల నగదు, రూ.1.9 కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలిపారు. ఇదే సమయంలో ఆడిట్‌ నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని ట్రస్టు పిటిషన్ దాఖలు చేసింది. నిర్వహణ కమిటీ పిటిషన్ గురించి ప్రస్తావించిన ధర్మాసనం.. ‘మొత్తం విషయంలోకి వెళ్లాలి.. ఆలయానికి చెందిన ఎంత నగదు ట్రస్ట్ వద్ద ఉంది?’ అని వ్యాఖ్యానించింది. గత శుక్రవారం ఈ అంశంపై వాదనలు ముగించి, తీర్పును రిజర్వులో ఉంచిన ధర్మాసనం.. బుధవారం తీర్పును వెలువరించింది.


By September 23, 2021 at 10:18AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/kerala-anantha-padmanabha-swamy-temple-trust-will-face-25-years-audit-supreme-court/articleshow/86446714.cms

No comments