Breaking News

ముంబయి: మూడో డోస్ వేసుకున్న ఆరోగ్య సిబ్బంది, రాజకీయ నేతలు!


కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ గురించి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలు దేశాలు మూడో డోస్‌ను ప్రారంభించాయి. ప్రపంచంలో వ్యాక్సిన్‌ పంపిణీలో అందరికన్నా ముందున్న ఇజ్రాయెల్‌ అవసరమైతే నాలుగో డోసు ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. ఇందుకోసం తగినన్ని వ్యాక్సిన్‌ డోసులను సమీకరించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఇజ్రాయెల్‌ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారత్‌లోనూ మూడో డోస్‌పై ఊహాగానాలు వెలువడుతుండగా.. ముంబయిలో ఇప్పటికే పలువురు ఆరోగ్య కార్యకర్తలు, రాజకీయ నేతలు వేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, కేంద్రం మాత్రం మూడో డోస్‌కు ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదని గురువారం ప్రకటించింది. కాగా, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ముంబయిలోని వివిధ ఆస్పత్రుల్లోని ఆరోగ్య కార్యకర్తలు మూడో డోస్ తీసుకున్నారు. కో-విన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా లేదా వేర్వేరు మొబైల్ ఫోన్ నెంబర్ల ద్వారా బూస్టర్ డోస్ వేసుకున్నట్టు సమాచారం. తమ శరీరంలో కోవిడ్ యాంటీబాడీల స్థాయిని పరీక్షించుకున్న తర్వాతే చాలా మంది మూడో డోస్ తీసుకున్నట్టు వెల్లడించారు. ఓ సీనియర్ వైద్యుడు మాట్లాడుతూ.. ఫిబ్రవరిలో రెండు డోస్‌ల టీకా పూర్తిచేసుకున్నవారు తమ యాంటీబాడీల స్థాయి తగ్గినట్టు గుర్తించడంతో డాక్టర్లు సహా బూస్టర్ డోస్ తీసుకున్నారు అని తెలిపారు. ముంబయికి చెందిన ఓ యువ వైద్యుడు ఆయన భార్య, ఇతర ఆస్పత్రి సిబ్బంది బూస్టర్ డోస్ వేసుకున్నట్టు సమాచారం. కోవిషీల్డ్‌ను మూడో డోస్‌గా తీసుకున్నారని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. కొన్ని సందర్భాల్లో వ్యాక్సిన్ వయల్‌లో చివరిగా మిగిలిపోయిన పదకొండో డోస్ వృథా కాకుండా కొందరు బూస్టర్ డోస్ వేసుకున్నట్టు తెలిపాయి. వ్యాక్సిన్ తీసుకున్న తమ సహచరులు బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్‌ బారినపడటంతో కొత్త వేరియంట్ల పుట్టుకొస్తాయని ఆరోగ్య సిబ్బంది ఆందోళన చెందుతున్నారని ఓ వైద్యుడు తెలిపారు. మూడో డోస్ గురించి మహారాష్ట్ర ఆరోగ్య శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి డాక్టర్ ప్రదీవ్ వ్యాస్ మాట్లాడుతూ.. ప్రజలను తప్పుదారి పట్టించే చర్యని వ్యాఖ్యానించారు. మూడో డోస్ కొన్ని సందర్భాల్లో భారీ ప్రాణహాని ప్రతిచర్యలకు దారితీస్తుందని చెప్పారు. ‘మనం శాస్త్రీయంగా ముందుకెళ్దాం.. భావోద్వేగాల ద్వారా కాదు’అని ఆయన వ్యాఖ్యానించారు.


By September 17, 2021 at 09:23AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/health-workers-and-politicians-take-to-booster-covid-dose-in-mumbai/articleshow/86282497.cms

No comments