Breaking News

పాక్ సూచనలతో అఫ్గన్ కొత్త ప్రధానిగా ఐరాస ఉగ్రవాద జాబితాలోని వ్యక్తి!


అఫ్గనిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకుని మూడు వారాలైనా కొత్త ప్రభుత్వ ఏర్పాటు ఇంకా కొలిక్కిరాలేదు. తాలిబన్, మిత్రపక్షం హక్కానీ నెట్‌వర్క్ మధ్య మనస్పర్ధలే ప్రభుత్వ ఏర్పాటులో జాప్యానికి కారణమని మీడియా నివేదికలు వెల్లడించాయి. అంతేకాదు, శుక్రవారం రాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుని నేత ముల్లా బరాదర్‌కు గాయాలైనట్టు ప్రచారం జరుగుతోంది. బరాదర్‌ను అత్యున్నత నేతగా ఎంపికచేయడాన్ని హక్కానీ నెట్‌వర్క్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అంతగా గుర్తింపులేని ఓ నేతను మధ్యేమార్గంగా తదుపరి అఫ్గన్ ప్రధానిగా ఖరారు చేస్తారని తెలుస్తోంది. పెద్దగా పేరు తెలియని తాలిబాన్ నేత, ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదుల జాబితాలో ఉన్న ముల్లా హసన్ అఖుండ్‌ పేరు తెరపైకి వచ్చింది. ముల్లాహ్ బరదార్ నేతృత్వంలోని తాలిబాన్ దోహా యూనిట్.. హక్కానీ నెట్‌వర్క్ మధ్య అధికారం కోసం పోటీ నెలకుంది. తాజా ప్రతిపాదన ప్రకారం.. ముల్లా హసన్ అఖుండ్‌‌ ప్రధానిగా.. ముల్లా బరాదర్, ముల్లా ఒమర్ తనయుడు ముల్లా యాకూబ్‌లను డిప్యూటీ పీఎంలుగా.. హక్కానీ నెట్‌వర్క్‌కు చెందిన సిరాజ్ హక్కానీ హోం మంత్రిగా ఉంటారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తాలిబన్ ముఖ్య మతపెద్ద హిబతుల్లా అఖుండ్జాదా అత్యున్నత నేతగా బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ప్రధానిగా పేరు ఖరారుపై తాలిబన్ నాయకత్వం ‘రెహ్బరీ షురా’ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అమెరికాతో యుద్ధం ప్రారంభానికి ముందు తాలిబాన్ నియంత్రణలో ఉన్న గత ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వంలో అఖుండ్ మంత్రిగా పనిచేశారు. తాలిబన్ ప్రభుత్వ ఏర్పాటు, మిత్రపక్షాల మధ్య విబేధాలను పరిష్కరించడానికి మధ్యవర్తిగా పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ చీఫ్ ఫైజ్ హమీద్ గతవారం కాబూల్‌కు వచ్చారు. సోమవారం రాత్రి ఆయన తిరిగి పాక్‌కు పయనమమయ్యారు. కాగా, అఖుండ్‌ను ప్రధానిగా పాకిస్థాన్ సూచనలతోనే ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. తాజా పరిణామాలతో అఫ్గన్‌లో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం విషయంలో తాలిబాన్ల నిబద్ధతపై సందేహాలను లేవనెత్తుతున్నాయి. కాబూల్‌ని స్వాధీనం చేసుకున్న తర్వాత తాలిబాన్‌లతో చర్చలు జరిపినప్పటికీ, మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, విదేశాంగ శాఖ మాజీ మంత్రి అబ్దుల్లా అబ్దుల్లాతో సహా మాజీ నాయకుల పాత్ర ప్రభుత్వ ఏర్పాటులో ఎక్కడా కనిపించడం లేదు.


By September 07, 2021 at 07:57AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/taliban-lightweight-leader-may-be-picked-as-afghan-pm-with-pak-help-says-sources/articleshow/85996368.cms

No comments