అది ఆ కుటుంబానికి కొంత ఊరటనిచ్చింది.. దానికి నా సహకారం ఉంటుంది అన్న మెగాస్టార్
కొద్దిరోజుల క్రితం తెలంగాణ రాజధాని హైదారాబాద్‌లోని ప్రాంతంలో ముక్కుపచ్చలారని చిన్నారిపై ఓ క్రూరుడు అతిదారుణంగా అత్యాచారానికి పాల్పడి.. ఆ తర్వాత ఆ చిన్నారిని హత్య చేసిన కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో అలజడి సృష్టించింది. ఆ మృగాడిని పట్టుకొనేందుకు ఘటన జరిగిన రోజు నుంచి పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అతనికి సంబంధించిన ఆనవాళ్లు.. అతను ఏ వేషంలో ఉన్న గుర్తించే విధంగా ఉండే ఫోటోలు విడుదల చేశారు. అంతేకాదు అతన్ని పట్టించిన వాళ్లకి రూ.10 లక్షలు పారితోషికం అందిస్తామని ప్రకటించారు. అయితే గురువారం అనుకోకుండా నిందితుడు రాజు స్టేషన్ ఘన్‌పూన్ వద్ద రైల్వేట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహం శరీరంపై ఉన్న‘మౌనిక’ అనే టాటూ ఆధారంగా అతను రాజునే అని పోలీసులు నిర్ధారించారు. అయితే రాజు మృతి చెందడంపై పలువురు సెలబ్రిటీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి మృగాడు బతికి ఉండటానికి వీలు లేదు అంటూ వాళ్లు కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అంటున్నారు. తాజాగా చిరంజీవి కూడా ఈ ఘటనపై స్పందించారు. ‘‘అభంశుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కిరాతకుడు రాజు తనకు అనే శిక్షించుకోవడం బాధిత కుటుంబానికి సహా అందరికీ ఊరటను కలిగిస్తుంది. ఈ సంఘటనపై మీడియా, పౌరసమాజం గొప్పగా స్పందించాయి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వంతో పాటు పౌర సమాజం చొరవ చూపాలి. అటువంటి కార్యక్రమం ఎవరు చేపట్టిన వారికి నా సహకారం ఉంటుంది. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలి’ అంటూ చిరూ ట్వీట్ చేశారు. చిరుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ ఘటనపై స్పందించారు.
By September 16, 2021 at 02:02PM
No comments