Breaking News

విషాదం: కెమెరామెన్‌ను కాపాడబోయి ప్రాణాలు పోగొట్టుకున్న మంత్రి


ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయిన ఓ కెమెరామెన్‌ను కాపాడబోయి మంత్రి ప్రాణాలు కోల్పోయిన ఘటన రష్యాలో చోటుచేసుకుంది. నొరిల్స్క్‌ ప్రాంతంలో జరిగిన విపత్తు ప్రతిస్పందన నిర్వహణ బృందం శిక్షణా కార్యక్రమంలో ఈ ఘటన జరిగినట్టు రష్యా ప్రభుత్వం వెల్లడించింది. రష్యా అత్యవసర విభాగం మంత్రి యెవజనీ జినిచెవ్‌ (55) నొరిల్స్క్‌ ప్రాంతంలో నిర్మిస్తోన్న ఓ అగ్నిమాపక కేంద్రాన్ని పరిశీలించడానికి వెళ్లారు. అక్కడ భారీ ఎత్తున ఏర్పాటు చేసిన రెస్క్యూ టీం మాక్‌ డ్రిల్‌ను పర్యవేక్షించారు. ఆ కార్యక్రమాన్ని చిత్రీకరిస్తోన్న ఓ కెమెరామెన్‌ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోవడంతో అతన్ని రక్షించేందుకు మంత్రి జినిచెవ్‌ దూకారు. మంత్రి దూకిన ప్రదేశంలో ఓ బండరాయి ఉండటంతో ఆయన తలకు బలంగా తగిలింది. దీంతో జినిచెవ్‌ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు రష్యా మీడియా ఆర్టీ వెల్లడించింది. ‘కొండ అంచున నిలబడి ఉన్న కెమెరామెన్ గ్రాబ్ అలెగ్జాండర్ ప్రమాదవశాత్తు జారిపడిపోయారు.. దీనిని గమనించి మంత్రి జెనిచివ్ నీటిలోకి దూకారు.. అక్కడ ఉన్న బండరాయి ఆయన తలకు బలంగా తగిలింది’ అని ఆర్టీ న్యూస్ ఎడిటర్ మార్గరేట్ సిమ్యాన్ ట్విట్టర్‌లో తెలిపారు. మంత్రి జినిచెవ్ ఫెడెరల్‌ సెక్యూరిటీ సర్వీసస్‌లో 1987 నుంచి సేవలందించారు. ఈ క్రమంలో 2006 నుంచి 2015 వరకు రష్యా అధ్యక్షుడు భద్రత విధులను నిర్వహించారు. అనంతరం కెలినిగ్రేడ్ ప్రాంత గవర్నర్‌గానూ, ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ డిప్యూటీ చీఫ్‌గా ఉన్నారు. అనంతరం 2018 నుంచి రష్యా అత్యవసర పరిస్థితుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మంత్రి జినిచెవ్‌ మృతిపట్ల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌ వెల్లడించింది.


By September 09, 2021 at 07:50AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/russian-minister-yevgeny-zinichev-dies-after-jumping-off-cliff-to-save-cameraman/articleshow/86055161.cms

No comments