Breaking News

రాచరికమే కాదు.. మీ డబ్బూ వద్దు.. ప్రేమకోసం రూ.కోట్లు తిరస్కరించిన యువరాణి!


సామాన్యుడ్ని ప్రేమించి, అతడితో జీవితం పంచుకునేందుకు రాజరికాన్ని కూడా వదులుకోడానికి జపాన్ రాకుమారి మకో సిద్ధపడిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సంప్రదాయం ప్రకారం సామాన్యుడిని పెళ్లాడే రాకుమారికి వివాహం సందర్భంగా రాజకుటుంబం కొంత మొత్తాన్ని అందజేస్తుంది. ఇందులో భాగంగా రాజకుమారి మకోకు కూడా 1.2 మిలియన్‌ అమెరికా డాలర్లు (దాదాపు రూ.8.77 కోట్లు) రాజకుటుంబం ఇవ్వజూపినట్లు సమాచారం. అయితే ఈ మొత్తాన్ని తీసుకునేందుకు మకో తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఓ సామాన్యుడిని ప్రేమించి, ఆయన్నే పెళ్లాడాలనుకున్న 29 ఏళ్ల మకోకు కుటుంబ సభ్యుల అడ్డంకులు ఎట్టకేలకు తొలగిపోయాయి. కుటుంబ సభ్యుల అనుమతితో మకో తాను ఇష్టపడిన వ్యక్తిని త్వరలో పెళ్లాడి అమెరికా వెళ్లిపోనున్నట్లు తెలిసింది. మకో ప్రస్తుతం అమెరికాలోనే న్యాయ విద్య అభ్యసిస్తున్నారు. నాలుగేళ్ల కిందటే మకో తన ప్రేమ వివాహం గురించి మీడియా ముందు వెల్లడించారు. నాలుగేళ్లయినా వివాహం జరగకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ అంశం వివాదాస్పదం కావడంతో రాజకుటుంబం తమ కుమార్తె అభిప్రాయాన్ని గౌరవించి, పెళ్లికి అంగీకరించింది. ఇదిలా ఉండగా, అక్కడ చట్టాల ప్రకారం వివాహం తర్వాత మకో రాజరిక వారసత్వాన్ని కోల్పోనున్నారు. మకో మేనత్త సయాకో సైతం సామాన్యుడ్ని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఇప్పుడు ఆమె వారసత్వాన్ని మేనకోడలు కొనసాగించడం గమనార్హం. ఇటీవలే బ్రిటన్ యువరాజు హ్యారీ సైతం రాజకుటుంబం వీడి సాధారణ జీవితం గడపడానికి సిద్ధమయిన విషయం తెలిసిందే. మకో కాబోయే భర్త కీ కొమురో‌పై తల్లి తన మాజీ ప్రియుడి నుంచి డబ్బు అప్పుగా తీసుకుని, దానిని తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారనే ఆరోపణలు రావడంతో రాజకుటుంబం తీవ్రంగా పరిశీలించింది. ఈ కారణంగానే వివాహం వాయిదా పడిందని, కుమురో న్యాయవాద విద్య కోసం అమెరికా వెళ్లిపోయాడని స్థానిక మీడియా పేర్కొంది. ఇక, కుమార్తె అభిప్రాయానికి మద్దతు తెలిపిన మకో తండ్రి, యువరాజు అకిషినో.. కానీ, ఆమె ప్రజల మనసులను గెలుచుకోవాల్సిన అవసరం ఉందని గతేడాది ప్రకటించారు.


By September 03, 2021 at 06:59AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/japanese-princess-mako-rejects-payout-ahead-of-wedding-to-commoner-reports/articleshow/85885999.cms

No comments