Breaking News

గడ్డం గీయడం, ట్రిమ్మింగ్‌ నిషేధం.. సెలూన్లకు హుకుం జారీచేసిన తాలిబన్లు


అఫ్గనిస్థాన్‌లో తాలిబన్ల అరాచకాలు షరా మూమలుగా కొనసాగుతున్నాయి. ఇస్లామిక్ చట్టాల ప్రకారమే పాలన కొనసాగుతుందని తమ చర్యల ద్వారా తెలియజేస్తున్నారు. తాజాగా, హెల్మాండ్ ప్రావిన్సుల్లో క్షౌరశాలలకు ‘గడ్డం’ గీయవద్దంటూ హుకుం జారీ చేశారు. గడ్డం తొలగించడం లేదా కత్తిరించడం ఇస్లామిక్ చట్టానికి విరుద్దమని పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. అంతేకాదు, హెయిర్ కట్స్ విషయంలోనూ షరియా చట్టాలను పాటించాల్సిందేనని తెల్చిచెప్పారు. ఇవే ఆదేశాలు తమకూ అందాయని కాబూల్‌లోని కొందరు సెలూన్ నిర్వాహకులు వెల్లడించారు. తాలిబన్ ఫైటర్లు తరుచూ తమ సెలూన్ వద్దకు వచ్చి గడ్డం గీయవద్దని ఆదేశిస్తున్నట్లు కాబూల్‌కి చెందిన ఓ సెలూన్ నిర్వాహకుడు తెలిపారు. వీటిపై తనిఖీలకు ఇన్‌స్పెక్టర్లను కూడా పంపుతామని హెచ్చరించారని పేర్కొన్నాడు. మరో సెలూన్ యజమాని మాట్లాడుతూ.. తాలిబన్ ప్రభుత్వ అధికారి పేరుతో తనకు ఓ ఫోన్ కాల్ వచ్చిందన్నారు. ఇకపై అమెరికన్ హెయిర్ స్టైల్స్ చేయవద్దని తనను హెచ్చరించాడని చెప్పారు. ‘దక్షిణ అఫ్గనిస్థాన్‌లోని హెల్మాండ్ ప్రావిన్సుల్లో గడ్డం గీయడం, పశ్చాత్య దేశాల హెయిల్ స్టయిల్స్‌పై నిషేధం విధించారు’ అని పేర్కొంటూ ఫ్రాంటియర్ పోస్ట్ తాలిబన్ల పేరుతో ఉన్న లేఖను ప్రచురించింది. ‘ఇస్లామిక్ ఓరియంటేషన్ మంత్రిత్వ శాఖ అధికారులు.. హెల్మాండ్ రాజధాని లష్కర్ గాహ్‌లోని పురుషుల క్షౌరశాలల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో హెయిర్ స్టైలింగ్, గడ్డం గీయవద్దని సూచించారు.. సెలూన్లలో సంగీతం, శ్లోకాలను కూడా వినిపించరాదని ఆదేశించారు.. ఈ ఆదేశాలను సోషల్ మీడియాలోనూ ప్రచారం చేయాలని తెలిపారు’ అని పేర్కొంది. ప్రజల వ్యక్తిగత ఇష్టాయిష్టాలతో పని లేకుండా తాలిబన్లు చెప్పినట్లు నడుచుకోవాల్సిందే. 1996-2001 వరకు సాగిన తాలిబన్ల పాలనలో స్టైలిష్ హెయిర్ కట్స్‌పై నిషేధం విధించారు. పురుషులు గడ్డం తీసుకోవద్దని ఆంక్షలు కొనసాగించారు. అయితే తాలిబన్ల పాలన ముగియడంతో అఫ్గన్లు క్లీన్ షేవ్‌,స్టైలిష్ హెయిర్ కట్స్‌కు అలవాటుపడ్డారు. తాజాగా, మళ్లీ ముష్కరుల ఆంక్షలతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తాలిబన్ల చేతిలో చావడం కన్నా గడ్డం తీయకపోవడమే బెటర్ అని వారు భావిస్తున్నారు.


By September 28, 2021 at 08:44AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/taliban-ban-barbers-from-trimming-beards-in-helmand-province-of-afghaistan/articleshow/86574311.cms

No comments