Breaking News

అమెరికాలో మెరుపు వరదలు.. న్యూయార్క్, న్యూజెర్సీలో అత్యవసర పరిస్థితి


భారీ వర్షాలతో అమెరికాలోని పలు రాష్ట్రాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. ముఖ్యంగా న్యూయార్క్ దాని పక్కనే ఉన్న న్యూజెర్సీ రాష్ట్రాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. దీంతో న్యూయార్క్‌, న్యూజెర్సీలో అత్యవసర పరిస్థితిని ప్రకటించి, విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. దక్షణాది రాష్ట్రం లూసియానాను ఐడా తుఫాను ముంచెత్తగ్గా.. ఉత్తరాది రాష్ట్రాల్లోనూ వరదలు, టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తుఫానుతో ప్రపంచ ఆర్ధిక, సాంస్కృతిక రాజధాని న్యూయార్క్‌లో భారీ వరదలు ముంచెత్తడంతో ఆ రాష్ట్ర గవర్నర్ కాథీ హోచుల్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. బ్రూక్లిన్, క్వీన్స్ నగరాలను వరదలు ముంచెత్తాయి. ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. దిగువ అంతస్తుల్లో ఉన్నవారు పై ఫ్లోర్స్‌కు వెళ్లాలని కిటికీలకు దూరంగా ఉండాలని తెలిపారు. న్యూయార్క్ రాష్ట్రంలోని పలు నగరాల్లోని విమానాశ్రయాలను మూసివేసి, వందలాది విమానాలను రద్దుచేశారు. ‘మధ్య అట్లాంటిక్ నుంచి దక్షిణ న్యూ ఇంగ్లాండ్‌ వరకు ఆకస్మిక వరదలు సంభవించి ప్రాణాంతకం కావచ్చు’ అని అమెరికా జాతీయ వాతావరణ విభాగం హెచ్చరించింది. అన్నాపొలిస్‌ను టోర్నడో ముంచెత్తింది. దీంతో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మేరీల్యాండ్‌‌లో వరదలకు 19 ఏళ్ల యువకుడు చనిపోయాడు. బుధవారం ఒక భవనం మునిగిపోవడంతో మరొక వ్యక్తి అదృశ్యమయ్యాడు. దీంతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఏడుకు చేరుకుంది. దక్షిణ కనెక్టికట్, ఉత్తర న్యూజెర్సీ, దక్షిణ న్యూయార్క్ ప్రాంతాలలో సుడిగాలుల ముప్పు పొంచి ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. ‘ఫిలడెల్ఫియా నగరం, సోమర్‌సెట్ కౌంటీ సహా చుట్టుపక్కల ప్రాంతాలకు అత్యంత ప్రమాదకరమైన ఘోరమైన ఆకస్మిక వరదలు’ సంభవిస్తాయని వాతావరణ శాఖ ట్వీట్ చేసింది.


By September 02, 2021 at 12:00PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/state-of-emergency-in-new-york-due-to-battling-flooding-caused-by-storm-ida/articleshow/85858967.cms

No comments