Afghanistan బహిరంగ ఉరి, చేతులు నరకడం మళ్లీ తప్పదు.. తాలిబన్లు సంచలన ప్రకటన!
అఫ్గనిస్థాన్ మరోసారి తాలిబన్ల ఏలుబడిలోకి రావడంతో ప్రజానీకం భయాందోళనకు గురవుతున్నారు. రెండు దశాబ్దాల కిందట వారి మూర్ఖపు పాలనను గుర్తుచేసుకుంటూ వణికిపోతున్నారు. ఆగస్టులో అఫ్గన్‌ను ఆక్రమించుకున్న తర్వాత తాము అందర్నీ క్షమించేశామని, ఎటువంటి ప్రతీకార దాడులు ఉండబోవని అగ్రనేతలు చేసిన ప్రకటనలు నీటి మాటలేనని తేటతెల్లమవుతోంది. మహిళ హక్కుల విషయంలో తాలిబన్ల తీరు మారలేదని ఇటీవల అక్కడ జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా, ఇస్లామిక్ చట్టం ప్రకారం తప్పు చేసినవారికి బహిరంగ ఉరి, చేతులు నరికివేతలు వంటి శిక్షలు మళ్లీ అమలు చేయనున్నట్టు తాలిబన్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. తాలిబన్ నేత అఫ్గన్ రాజధాని కాబూల్‌లో అసోసియేట్ ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘స్టేడియంలో శిక్షల విషయంలో ప్రతి ఒక్కరూ మమ్మల్ని విమర్శించారు.. కానీ వారి చట్టాలు, శిక్షల గురించి మేము ఎన్నడూ ఏమీ అనలేదు.. మా చట్టాలు ఎలా ఉండాలో ఎవరూ మాకు చెప్పాల్సిన అవసరం లేదు.. మేము ఇస్లాంను అనుసరిస్తాం.. ఖురాన్ ఆధారంగా మా చట్టాలను రూపొందిస్తాం’ అని వ్యాఖ్యానించారు. ఇక, అఫ్గన్ గడ్డపై రెండు దశాబ్దాల సుదీర్ఘ పోరాటానికి అమెరికా ముగింపు పలికి, అక్కడ నుంచి వైదొలగడంతో తాలిబన్లు మళ్లీ ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. పశ్చిమ దేశాల మద్దతున్న ప్రభుత్వాన్ని కూలదోసిన తాలిబన్లు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. అయితే, ప్రస్తుతం తాలిబన్ల అంతర్గ శత్రువుల బెడదను ఎదుర్కొంటున్నారు. విజయవంతమైన వారి గెరిల్లా వ్యూహాన్నే శత్రువులను అవలంబిస్తున్నారు. కాబూల్ విమానాశ్రయంలో గత నెల 26న ఆత్మాహుతి దాడులు, గతవారం జలాలాబాద్‌లో వరుస పేలుళ్లకు తామే బాధ్యులమని ఐఎస్ ఉగ్రవాదులు ప్రకటించారు. ప్రస్తుతం ఐఎస్ వంటి ఉగ్రవాదుల నుంచి అఫ్గన్ ప్రభుత్వానికి ముప్పు పొంచి ఉంది. ఇదే సమయంలో తాలిబన్ మిత్రపక్షాల మధ్య కూడా విభేదాలు తలెత్తడంతో ఎన్నాళ్లూ వీరు మనుగడ సాగిస్తారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఇస్లామిక్ ఉగ్రవాదుల ఉనికి అఫ్గన్‌లో అంతగా లేదని తాలిబన్ అధికార ప్రతినిధి జబిబుల్లా ముజాహిద్ ప్రకటించడం గమనార్హం.
By September 24, 2021 at 10:46AM
No comments