మా గ్రామానికి రోడ్డు వేసే వరకూ పెళ్లి చేసుకోను.. సీఎంకి లేఖ రాసిన 26 ఏళ్ల యువతి!
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రహదారుల దుస్థితి దయనీయంగా ఉంది. ఇక, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సమస్యపై అధికారులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఏం ఒరగడం లేదు. ఈ నేపథ్యంలోనే కర్ణాటకకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు వినూత్నంగా తన గ్రామంలోని రోడ్డ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. తమ గ్రామానికి సరైన రోడ్లు వేసేవరకూ తాను వివాహం చేసుకోనని శపథం చేసింది. ఈ మేరకు సీఎంఓ కార్యాలయానికి యువతి లేఖ రాసింది. దేవంగరా జిల్లా హెచ్ రామ్‌పురా ప్రాంతానికి చెందిన బిందు (26) అనే యువతి ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. తమ గ్రామంలో దయనీయ పరిస్థితిలో ఉన్న రహదారులు.. వాటివల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి ఓ లేఖ రాసింది. వెంటనే రహదారులను బాగుచేయాలని ఆమె కోరింది. ‘మా గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేక ఇంకా వెనుకబడే ఉంది. రోడ్లు సరిగా లేక మా గ్రామంలోని పిల్లలు చదువుకోవడం లేదు. అలాగే మా ఊరి అమ్మాయిలు, అబ్బాయిలకు పెళ్లి సంబంధాలు కూడా రావడంలేదు’ అని బిందు తన లేఖలో పేర్కొన్నారు. ‘మొత్తం 300 మందికిపైగా జనాభా ఉన్న తమ గ్రామానికి రోడ్డుగానీ, బస్సు సౌకర్యంగానీ లేదు... స్కూల్, వైద్యం కోసం గ్రామానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న మయకొండకు వెళ్లాల్సి వస్తోంది.. తాను స్కూల్‌కు వెళ్లడానికి కనీసం 14 కిలోమీటర్లు రోజూ నడవాల్సి వస్తోంది.. ఈ కారణంతోనే గ్రామంలోని బాలికలు ఎవరూ చదువుకోవడం లేదు.. మధ్యలోనే బడి మానేస్తున్నారు.’ అని తెలిపింది. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మా ఊరికి రోడ్డు వేయాలని మా పెద్దల కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు అని పేర్కొంది. ఉపాధ్యాయురాలు లేఖపై సీఎంఓ కార్యాలయం స్పందించింది. మీ గ్రామ సమస్యను త్వరలోనే తీరుస్తామని హామీ ఇచ్చింది. అక్కడ తక్షణమే పనులు చేపట్టాలని గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయితీరాజ్ శాఖను సీఎంఓ కార్యాలయం ఆదేశించింది. జరుగుతున్న పనుల గురించి ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించింది. ‘ఇప్పటికే రోడ్ల అభివృద్ధి కోసం రూ. 2 లక్షల వరకూ ఖర్చుచేశాం.. ఇది సరిపోదు.. రహదారుల కోసం రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకూ అవసరం.. ఈ నిధుల కోసం ప్రభుత్వం సహా స్థానిక ఎమ్మెల్యేను అభ్యర్థించాం’ అని స్థానిక పంచాయతీ అధికారి ఒకరు తెలిపారు.
By September 18, 2021 at 10:13AM
No comments