Breaking News

వ్యాక్సినేషన్‌లో భారత్ ప్రపంచ రికార్డు.. నిన్న ఒక్క రోజే 2.5 కోట్ల డోస్‌లు పంపిణీ


కోవిడ్ వ్యాక్సినేషన్‌లో భారత్ సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ప్రధాని నరేంద్ర నాడు దేశవ్యాప్తంగా 2.5 కోట్ల టీకా డోస్‌లను పంపిణీ చేశారు. ఒక్క రోజులోనే ఇంత భారీగా టీకాలు పంపిణీ చేయడం ప్రపంచంలోనే ఇదే మొట్టమొదటిసారి. ఇప్పటి వరకూ ఒక్క రోజులో చైనా అత్యధికంగా 2.47 కోట్ల డోస్‌లను పంపిణీ చేసింది. తాజాగా, ఆ రికార్డును భారత్ బద్దలుకొట్టింది. శుక్రవారం దేశవ్యాప్తంగా 2.5 కోట్ల డోస్‌లను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ధ్రువీకరించింది. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో వెల్లడించారు. అంతకు ముందు సైతం దీనిపై స్పందించారు. రికార్డుస్థాయి వ్యాక్సినేషన్ ప్రతి భారతీయుడికీ గర్వకారణమని, ఆరోగ్య, ఫ్రంట్‌లైన్ వర్కర్లు కష్టించి పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని అన్నారు. శుక్రవారం సాయంత్రానికే 2 కోట్ల మార్క్ దాటినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆగ్నేయాసియా విభాగం ట్వీట్ చేసింది. వ్యాక్సినేషన్‌లో భారత్‌ మరో మైలురాయిని అధిగమించిందని శుభాకాంక్షలు తెలిపింది. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజున మధ్యాహ్నం 1.30 గంటలకే దేశంలో కోటి టీకా డోస్‌లు పంపిణీ చేశారు.. ఈ మార్క్‌ను అత్యంత వేగంగా చేరాం.. ఇంకా ప్రక్రియ కొనసాగుతోంది.. వ్యాక్సినేషన్‌లో ఈ రోజు కొత్త రికార్డు నెలకొల్పి ప్రధానికి జన్మదిన కానుక అందజేస్తాం’’ అని ట్విట్టర్‌లో మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. ప్రభుత్వం ట్రాకింగ్ వ్యవస్థ సెకెన్‌కు 800 డోస్‌లు.. నిమిషానికి 48,000 డోస్‌లు పంపిణీ చేసినట్టు వెల్లడించింది. ఇది చరిత్రాత్మక దినమని జాతీయ ఆరోగ్య అథారిటీ చీఫ్ ఆర్ఎస్ శర్మ అన్నారు. ప్రభుత్వ అత్యున్నత నిపుణుడు డాక్టర్ ఎన్‌కె అరోరా మాట్లాడుతూ.. శుక్రవారం నిర్వహించిన రికార్డు సంఖ్యలో వ్యాక్సినేషన్ నెలరోజుల నిరంతర ప్రయత్నాల ఫలితమని చెప్పారు. టీకా డోస్‌ల సంఖ్యను పెంచడం అత్యవసరమని, డిసెంబర్ చివరి నాటికి జనాభాలో కనీసం 60 శాతం మందికి రెండు డోస్‌లు అందించాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి రోజుకు 1.2 కోట్లకు పైగా డోస్‌లు పంపిణీ చేయాలన్నారు. ఇప్పటి వరకూ దేశంలో ఒక్క రోజులో కోటికిపైగా డోస్‌లు మూడుసార్లు మాత్రమే వేశారు. ఆగస్టు 27, 31, సెప్టెంబరు 6న కోటి డోస్‌లు పంపిణీ జరిగింది. తాజాగా, సెప్టెంబరు 17న 2.5 కోట్ల పంపిణీ జరిగింది. దేశంలో వ్యాక్సినేషన్ 10 కోట్ల టీకా మార్కును చేరడానికి 85 రోజులు, 20 కోట్ల మార్కును దాటడానికి మరో 45 రోజులు, 30 కోట్ల మార్కును చేరుకోవడానికి మరో 29 రోజులు పట్టిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.


By September 18, 2021 at 07:32AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-creates-world-record-on-pms-birthday-with-2-5-crore-vaccinations-in-24-hours/articleshow/86310544.cms

No comments