Breaking News

దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక నేరాలు.. 2019తో పోల్చితే గతేడాది 27 శాతం తగ్గుదల


గతేడాది దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక నేరాలకు పాల్పడిన కేసులు 5,613 నమోదుకాగా.. 7,607 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఇది అంతకు ముందు ఏడాది2019తో పోల్చితే 26.7 శాతం తక్కువ. ఆ ఏడాది 7,656 నేరాలు నమోదుకాగా.. 12,140 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్సీఆర్బీ) నివేదికను విడుదలచేసింది. ఐపీసీ సెక్షన్ 121-123, 124ఏ (దేశద్రోహం), 153బీ (జాతీయ సమైక్యతకు భంగం కలిగించడం), చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం, ప్రజా ఆస్తులు, అధికారిక రహస్యాల చట్టం తదితరాల కింద కేసులు నమోదైనట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా 2020లో నమోదయిన మొత్తం 5,613లో 4,524 కేసులు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, 796 కేసులు ఉపా చట్టం, 99 కేసులు ఐపీసీ సెక్షన్ 121-123, 82 కేసులు ఐపీసీ సెక్షన్ 153బీ, 73 కేసులు దేశద్రోహం చట్టం, 39 కేసులు అధికారిక రహస్యాల చట్టం కింద నమోదయ్యాయి. ఉత్తర్ ప్రదేశ్‌లో అత్యధికంగా 39 శాతం కేసులు నమోదుకావడం గమనార్హం. అంతేకాదు, గతేడాది యూపీలో నమోదైన కేసుల్లో 96 శాతం ప్రజా ఆస్తులకు నష్టకలిగించనవే. ఈ కేసుల్లో యూపీ తర్వాత తమిళనాడు (668), అసోం (333), జమ్మూ అండ్ కశ్మీర్ (317), ఢిల్లీ (18) ఉన్నాయి. ఇక, ఉపా చట్టం కింద నమోదయిన మొత్తం కేసుల్లో అత్యధికంగా జమ్మూ కశ్మీర్ (287)లో నమోదు కాగా... తర్వాతి స్థానాల్లో మణిపూర్ (169), ఝార్ఖండ్ (86), అసోం (76), యూపీ (72) నిలిచాయి. దేశద్రోహం కేసులు అత్యధికంగా మణిపూర్ (15), అసోం )12), యూపీ (7)లో నమోదయ్యాయి. ఇక, అధికారిక రహస్యాల చట్టం కేసుల్లో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంది. ప్రభుత్వ వ్యతిరేక నేరాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొని అరెస్టయిన 7,607 మంది నిందితుల్లో 956 మంది దోషులుగా నిర్ధారణ కాగా.. 1,286 మంది నిర్దోషులుగా తేలారు. మరో 54 మంది విడుదలయ్యారు. ప్రజా ఆస్తుల ధ్వంసం కేసుల్లో మొత్తం 6,009 మంది అరెస్ట్ కాగా.. ఉపా చట్టం కింద 1,321 మంది, దేశద్రోహం చట్టం కింద 44 మంది, ఓఎస్ఏ కింద 52 మందిని అరెస్ట్ చేశారు. ఉపా చట్టం కింద అరెస్టయినవారిలో 82 మంది దోషులుగా వెల్లడయ్యింది.


By September 16, 2021 at 11:22AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/over-5600-offences-against-state-in-2020-27-percent-fall-from-recorded-in-2019/articleshow/86253603.cms

No comments