Breaking News

Taliban ఇరవై ఏళ్లు అధికారంలో లేకపోయినా కళ్లు చెదిరే ఆదాయం.. వీళ్లు చాలా రిచ్!


అమెరికా సైన్యాలు వైదొలగిన వారం రోజుల్లోనే యావత్ తాలిబన్లకు దాసోహమయ్యింది. అమెరికా శిక్షణలో ఆరితేరిన అఫ్గన్ పౌర ప్రభుత్వ సైన్యం ఎటువంటి ప్రతిఘటన లేకుండానే తాలిబన్లకు లొంగిపోయారు. అమెరికా నిష్క్రమణతో సునాయాసంగా పట్టుసాధించారు. అయితే, రెండు దశాబ్దాలపాటు అధికారంలో లేకున్నా.. అమెరికా బలగాలకు ఎదురొడ్డి యుద్ధ క్షేత్రంలో నిలిచి తాలిబన్లు పోరాడం విస్మయానికి గురిచేస్తోంది. వారికి అండదండలు ఎవరిచ్చారు? ఆర్థిక మూలాలపై ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ప్రఖ్యాత ఫోర్బ్స్‌ మ్యాగిజైన్ 2016లో విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని సంపన్న ఉగ్రవాద సంస్థల్లో తాలిబన్లు ఐదో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో రూ.14,800 కోట్లు వార్షిక ఆదాయంతో ఐసిస్‌ తొలిస్థానంలో నిలిచింది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. తాలిబన్ల వార్షిక ఆదాయం రూ.2900 కోట్లు. వీరికొచ్చే ఆదాయంలో సింహభాగం డ్రగ్స్ అక్రమ రవాణా, మైనింగ్‌ వ్యాపారం వల్లే లభిస్తోంది. ఇక, గతేడాది నాటో విడుదల చేసిన నివేదికలోనూ పలు ఆశ్చర్యకరమైన వివరాలు వెల్లడయ్యాయి. 2019-20లో తాలిబన్ల వార్షిక బడ్జెట్‌ దాదాపు రూ.11,829 కోట్లు అని ‘నాటో’ తన నివేదికలో పేర్కొంది. 2016 నాటి ఫోర్బ్స్‌ నివేదికతో పోల్చితే పెరుగుదల 400 శాతం నమోదయ్యింది. స్వతంత్ర రాజకీయ, సైనిక సంస్థగా మారడానికి తాలిబాన్ నాయకత్వం స్వయం సమృద్ధి విధానాన్ని అవలంభిస్తోందనే వాస్తవాన్ని నాటో రహస్య నివేదిక స్పష్టం చేసింది. గత కొన్నేళ్లుగా విదేశీ నిధులు, సహకారంపై ఆధారపడటం తాలిబన్లు తగ్గించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2017-18 సంవత్సరం మొత్తం ఆదాయంలో సగం విదేశాల నుంచి అందుకున్నట్లు నివేదిక పేర్కొంది. అయితే, ఇది 2020 నాటికి దాదాపు 15 శాతానికి తగ్గిపోయింది. ఇదే సమయంలో అఫ్గన్ సైన్యానికి నిధుల కేటాయింపుల్లో తిరోగమనం కనిపిస్తుంది. ఆ దేశ వార్షిక బడ్జెట్ రూ.40వేల కోట్లలో సైన్యానికి కేవలం రూ.800 కోట్లు మాత్రమే కేటాయించారు. తాలిబన్‌లతో నేరుగా పోరాడటానికి లేదా ఆఫ్గన్ దళాలకు శిక్షణ ఇవ్వడానికి ఈ 19 ఏళ్లలో అమెరికా దాదాపు ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ఇంత ఖర్చుచేసి ఏం సాధించిందంటే? సమాధానం లేదు.ఇప్పుడు, అఫ్గన్‌లో అధికారం చేజిక్కించుకోవడంతో ఆదాయం మరింత పెరుగుతుంది. పూర్తిగా ఆర్థిక కోణం నుంచి చూస్తే, తాలిబాన్ల పెట్టుబడిపై రాబడి రోజురోజుకు మెరుగుపడుతోంది.. యుఎస్, నాటో దళాల వల్ల కలిగే అంతరాన్ని వారు త్వరగా పూరించడంతో వ్యాపారం అభివృద్ధి చెందుతోంది. ఇక, 2019-20లో తాలిబన్ల వార్షిక ఆదాయం 1.6 బిలియన్ డాలర్లు (రూ.11,829 కోట్లు) కాగా.. అందులో మైనింగ్ 464 మిలియన్ డాలర్లు (రూ.3,400 కోట్లు), డ్రగ్స్ 416 మిలియన్ డాలర్లు (రూ.3,087 కోట్లు), విదేశీ విరాళాలు 240 మిలియన్ డాలర్లు (రూ.1,781 కోట్లు), ఎగుమతులు 240 మిలియన్ డాలర్లు (రూ.1,781 కోట్లు), పన్నులు 160 మిలియన్ డాలర్లు (రూ.1,187 కోట్లు), రియల్ ఎస్టేట్ 80 మిలియన్ డాలర్లు (రూ.593 కోట్లు).


By August 16, 2021 at 10:53AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/afghanistan-crisis-how-rich-is-the-taliban-and-where-does-their-money-come-from/articleshow/85361402.cms

No comments