Breaking News

Taliban పంజ్‌షీర్‌లో ఊహించని ప్రతిఘటన.. లోయను చుట్టుముట్టిన ఫైటర్లు


అఫ్గనిస్థాన్‌పై తాలిబన్లు పూర్తి ఆధిపత్యం సాధించినా పంజ్‌షీర్ లోయలో మాత్రం వారికి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. బగ్లాన్‌ ప్రావిన్సులో తాలిబన్లపై తిరుగుబాటు చేసిన స్థానిక ప్రజలు ఆదివారం మూడు జిల్లాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఉలిక్కిపడ్డ తాలిబన్లు ఆ జిల్లాలను సోమవారం తిరిగి ఆక్రమించుకుని తమదే పైచేయి అని నిరూపించుకుంది. తాలిబన్లకు వ్యతిరేకంగా అఫ్గన్‌లో ఆదివారం తొలి సాయుధ తిరుగుబాటు చోటుచేసుకుంది. కాబుల్‌కు ఉత్తరాన దాదాపు 120 కిలోమీటర్ల దూరంలోని బగ్లాన్‌ ప్రావిన్సులో స్థానిక సాయుధ ప్రజలు ఎదురుతిరిగారు. అక్కడి అంద్రాబ్‌ లోయలోని బానో, దేహ్‌ సలాహ్‌, పుల్‌ ఎ-హెసార్‌ జిల్లాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిణామంతో ఖంగుతిన్న తాలిబన్లు.. వెంటనే తేరుకున్నారు. అక్కడ అదనపు దళాలను తరలించి, మూడు జిల్లాలను తిరిగి తమ వశం చేసుకున్నారు. అయితే, తిరుగుబాటుదారులు సోమవారం జరిపిన మెరుపుదాడుల్లో కీలక నేత సహా 50 మందికి పైగా ఫైటర్లు హతమయ్యారు. అయితే, వీరి సంఖ్య 300 మందికిపైగా ఉంటుందని అంతర్జాతీయ మీడియా తెలిపింది. మృతుల్లో బను జిల్లా తాలిబన్‌ చీఫ్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పంజ్‌షేర్‌ను ఆక్రమించుకునే ప్రయత్నాలను తాలిబన్లు ముమ్మరం చేశారు. వందల మంది ఫైటర్లు ఆ ప్రావిన్సులను చుట్టుముట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే, ముష్కర మూకలు నేరుగా ఆక్రమణకు పాల్పడకుండా పంజ్‌షేర్‌లోని అఫ్గాన్‌ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌, దివంగత దిగ్గజ మిలటరీ కమాండర్‌ అహ్మద్‌ షా మసూద్‌ తనయుడు అహ్మద్‌ మసూద్‌ తదితరులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇరువైపులా ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టు మసూద్ సహచరుడు ఒకరు తెలిపారు. ‘‘మా సైనికులు పంజ్‌షిర్‌ను మూడు వైపుల నుంచి చుట్టుముట్టారు’’ అని తాలిబన్ల ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌ ట్వీట్‌ చేశారు. కానీ.. వారితో పోరాడడం కన్నా చర్చలకే తాము ప్రాధాన్యమిస్తున్నామని.. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు.. పంజ్‌షిర్‌ నుంచి తాలిబ న్లను ప్రతిఘటిస్తున్న ‘నేషనల్‌ రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (ఎన్‌ఆర్‌ఎఫ్‌)’ కూడా చర్చలకు సిద్ధంగా ఉంది.


By August 24, 2021 at 10:10AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/taliban-near-resistance-stronghold-panjshir-valley-after-retaking-3-districts/articleshow/85584068.cms

No comments