Taliban ‘ఇంతకంటే అవమానమా.. బైడెన్ దిగిపో’ అఫ్గన్ సంక్షోభంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
దాదాపు 20 ఏళ్ల పాటు యుద్ధం చేసిన అమెరికా సైన్యాలు.. అఫ్గనిస్థాన్ నుంచి పూర్తిగా వైదొలడంతో తాలిబన్ల తిరిగి వశం చేసుకున్నారు. దీనిపై అమెరికా మాజీ అధ్యక్షుడు స్పందిస్తూ.. ఇలా జరగడానికి ప్రస్తుతం అధ్యక్షుడు కారణమని ఆరోపించారు. ఈ పరిణామాలకు బాధ్యత వహిస్తూ జో బైడెన్ రాజీనామా చేయాలని ట్రంప్ డిమాండ్ చేశారు. అఫ్గన్‌ను తాలిబన్లు తిరిగి ఆక్రమించుకోడానికి అవకాశం కల్పించారని, బైడెన్ హాయంలో అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద ఓటమని మాజీ అధ్యక్షుడు ధ్వజమెత్తారు. ‘అఫ్గనిస్థాన్‌లో తాలిబన్ ముష్కరులు రెచ్చిపోవడానికి అనుమతించినందుకు జో బిడెన్ అవమానంతో రాజీనామా చేయాల్సిన సమయం వచ్చింది’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో అమెరికాలో మరోసారి భారీ సంఖ్యలో కోవిడ్-19 కేసులు, హెచ్-1బీ ఇమ్మిగ్రేషన్ విధానం, ఆర్ధిక, పాలనాపరమైన విధానాలపై ట్రంప్ విరుచుకుపడ్డారు. ఇదిలా ఉండగా, అఫ్గన్ నుంచి సైన్యాల ఉపసంహరణకు ట్రంప్ హయాంలోనే బీజం పడింది. దోహా వేదికంగా 2020 ఫిబ్రవరిలోనే తాలిబన్లతో శాంతి ఒప్పందంపై సంతకం చేశారు. భద్రత విషయంలో తాలిబన్ల నుంచి హామీ లభించడంతో అమెరికా, మిత్రరాజ్యాల సైన్యాలను 2021 మే నాటికి పూర్తిగా ఉపసంహరించుకుంటామని ట్రంప్ వెల్లడించారు. అయితే, ఈ ఏడాది జనవరిలో అధికారం చేపట్టిన జో బైడెన్.. అఫ్గన్ నుంచి సైన్యం ఉపసంహరణ గడువును సెప్టెంబరు 1కి పొడిగిస్తూ ఎటువంటి షరతులు విధించలేదు. బైడెన్ నిర్ణయంపై ట్రంప్ పలుసార్లు విమర్శలు గుప్పించారు. ఒకవేళ తాను తిరిగి అధికారంలోకి వచ్చుంటే భిన్నంగా ఉండేదని, బలగాల ఉపసహరణ చాలా విజయవంతంగా జరిగేదని ఎదురుదాడి చేశారు. ‘అఫ్గనిస్థాన్ విషయంలో జో బిడెన్ చేసిన నిర్వాకం.. అమెరికా చరిత్రలో గొప్ప ఓటములలో ఒకటిగా నిలిచిపోతుంది!’ అని ఆదివారం ఓ ప్రకటన చేశారు. దీనిపై బైడెన్ యంత్రాంగం కూడా ఘాటుగా స్పందించింది. సైన్యం ఉపసంహరణకు దోహా ఒప్పందంపై సంతకం చేసింది ఎవరు.. మెజార్టీ అమెరికన్లు యుద్ధం ముగియాలని కోరుకున్నారని ఎదురుదాడి చేసింది. అఫ్గన్‌లో ప్రస్తుత పరిస్థికి కారణం మీరంటే మీరని తాజా, మాజీ అధ్యక్షులు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అమెరికా నిఘా వర్గాలకు ఘోరమైన ఓటమిలో ఇదొకటి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబూల్‌ను 30 నుంచి 90 రోజుల్లోగా తాలిబన్లు ఆక్రమించుకుంటారని అమెరికా నిఘా అధికారులు ప్రకటించిన 24 గంటల్లోనే అనూహ్యంగా తాలిబన్ మూకలు రాజధానిని వశం చేసుకున్నాయి. దీనిని నిపుణులు ఎత్తిచూపుతున్నారు. అఫ్గన్ పరిణామాలను అంచనా వేయడంలో విఫలమయ్యారని వ్యాఖ్యానించాయి.
By August 16, 2021 at 09:22AM
No comments