Breaking News

Taliban కాబూల్‌‌ను వశం చేసుకున్నారు.. తాలిబన్ల తదుపరి లక్ష్యం ఏంటి?


అఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్‌లోకి తాలిబన్‌లు ప్రవేశించడంతో దేశం మొత్తం వారి అధీనంలోకి వెళ్లింది. దీంతో ప్రస్తుత అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయారు. అఫ్గన్‌లో యుద్ధం ముగిసిందని, పూర్తిగా అధికారం సొంతమైందని తాలిబన్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాలిబన్ల తదుపరి లక్ష్యం ఏంటి? ఏం చేయబోతున్నారనేది ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. అయితే, అఫ్గన్‌ను తాము స్వాధీనం చేసుకున్న తరువాత ప్రభుత్వ పాలనలో ఎటువంటి పరివర్తన ఉండదని తాలిబన్‌కు చెందిన ప్రతినిధులు వ్యాఖ్యానించారు. దేశం విడిచి పారిపోయిన అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ తజికిస్థాన్‌లో ఉన్నట్టు అంతర్గత వ్యవహారాల శాఖ అధికారులు తెలిపాయి. అయితే, ఆయన ఎక్కడున్నారనేది తెలియదని విదేశాంగ శాఖ వెల్లడించగా.. ఘనీ ఎక్కడున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని తాలిబన్లు పేర్కొన్నారు. కాబూల్‌‌ను ఆక్రమించుకోడానికి ముందు సైన్యం, తాలిబన్ల మధ్య కాల్పులు జరిగినట్టు అక్కడ మీడియా తెలిపింది. నగర సరిహద్దుల్లో జరిగిన పోరులో 40 మందికిపైగా గాయపడ్డారని, వీరిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్చించారని వివరించింది. ఇదిలా ఉండగా, అధికార బదలాయింపు జరిగిందా? లేదా? అనేది స్పష్టంగా తెలియరాలేదు. పశ్చిమ దేశాల మద్దతున్న ప్రభుత్వం శాంతియుతంగా అధికారం అప్పగిస్తుందని వేచిచూస్తున్నామని తాలిబన్లు తెలిపారు. శాంతియుతంగా అధికార మార్పిడి పూర్తయ్యే వరకూ నగరం ప్రవేశ మార్గాల వద్ద యోధులు పహారా కాస్తారని ఆ సంస్థ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ అన్నారు. 1996 నుంచి 2001 వరకు తాలిబన్ల ఆటవిక పాలనలో అఫ్గన్లు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. ఇస్లామిక్‌ పాలన పేరిట కఠిన షరియా చట్టాన్ని అమలు చేశారు. హంతకులను, అక్రమ సంబంధానికి పాల్పడినట్లు అనుమానిస్తున్న స్త్రీ, పురుషుల తలలు నరకడం లేదా బహిరంగంగా ఉరితీయడం, చోరీలకు పాల్పడినవారి చేతులు నరకడం వంటి అనాగరిక శిక్షలు అమలు చేశారు. పురుషులు గడ్డాలు పెంచాలనీ, మహిళలు తప్పనిసరిగా బురఖాలు ధరించాలనీ ఆదేశించారు. 10 ఏళ్లు పైబడిన బాలికలు పాఠశాలలకు వెళ్లకూడదని ఆంక్షలు విధించారు. సంగీతం, టీవీ, సినిమాలనూ నిషేధించారు. నాటి అకృత్యాలు కళ్లముందు మెదులాడుతుండటంతో అక్కడి ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అయితే, ప్రజల ఆస్తులు, జీవితాలకు ఎటువంటి ప్రమాదం ఉండబోదని తాలిబన్ అధికార ప్రతినిధి అన్నారు. తాలిబన్ల భయంతో చాలా మంది ఇళ్లను, ఆస్తులను వదిలేసి విదేశాలకు పయనమవుతున్నారు. పలువురు ఐరోపా సమాఖ్య సిబ్బందిని కాబూల్‌లోని సురక్షిత ప్రదేశానికి తరలించినట్టు నాటో కూటమికి చెందిన ఓ అధికారి తెలిపారు.


By August 16, 2021 at 08:26AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/after-taking-over-kabul-heres-what-the-taliban-eye-next-in-afghanistan/articleshow/85359072.cms

No comments