Taliban అఫ్గన్ సైన్యం భీకర వైమానిక దాడులు.. ఒక్క రోజే 254 మంది తాలిబన్లు హతం
అఫ్గనిస్థాన్ నుంచి అమెరికా, నాటో సేనల ఉపసంహరణ ప్రక్రియ సెప్టెంబరు నాటికి పూర్తికావాల్సి ఉన్నా.. ఇప్పటికే సైన్యాలను దాదాపు వెనక్కు వెళ్లిపోయాయి. దీంతో అఫ్గన్‌లో రెచ్చిపోతున్నారు. ఇప్పటికే దాదాపు 70 శాతం భూభాగాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నట్టు తెలుస్తోంది. మరోసారి తాలిబన్ల అకృత్యాలు పెచ్చుమీరుతున్నాయి. ఈ నేపథ్యంలో అఫ్గన్ సైన్యానికి, తాలిబన్లకు మధ్య భీకర పోరు సాగుతోంది. తాలిబన్లను మట్టుబెట్టేందుకు అఫ్గన్ ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక ఆపరేషన్‌ను ప్రారంభించింది. ఘాంజి, కాందహార్, హెరాత్, ఫరా, కాబూల్, బర్మల్‌తోపాటు పలు ప్రాంతాల్లో సైన్యాలు సోదాలు నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా గడిచిన 24 గంటల్లో అఫ్గన్ జాతీయ రక్షణ, భద్రతా దళాలు (ఏఎన్‌డీఎస్‌ఎఫ్).. 254 మంది తాలిబన్ మిలిటెంట్లను హతమార్చినట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో కొందరు పాకిస్థాన్‌కు చెందిన టెర్రరిస్టులు కూడా ఉన్నట్లు తెలిపింది. పోలీసు దాడుల్లో కనీసం 100 మందికిపైగా తాలిబన్లు గాయపడినట్లు స్పష్టం చేసింది. ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. తాలిబన్ల స్థావరాలపై వైమానిక దాడులు జరిపిన వీడియోను అఫ్గన్ పౌర ప్రభుత్వం ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది. కాందహార్ ప్రావిన్సుల్లోని జెరాయ్ జిల్లాలో జరిగిన ఎయిర్ స్ట్రయిక్స్‌లో పదలు సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారని, పలువురు గాయపడ్డారని తెలిపింది. అఫ్గన్ సైన్యం దాడులు కొనసాగుతుండగా.. తాలిబన్లు కూడా విధ్వంసాలకు తెగబడుతున్నారు. కాందహార్ అంతర్జాతీయ విమానాశ్రయంపై శనివారం రాత్రి రాకెట్ల దాడి జరిగింది. ఈ విషయాన్ని విమానాశ్రయ చీఫ్ మసూద్ పష్తూన్ ధ్రువీకరించారు. రెండు రాకెట్లు రన్‌వేను తాకాయని తెలిపారు. దీంతో విమాన సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయన్నారు. రన్‌వేను మరమ్మతు పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నాయని పేర్కొన్నారు. మూడు రాకెట్లను ప్రయోగించినా.. ఒకటి మాత్రం విమానాశ్రయం బయటపడిపోయింది. గతంలో కాందహార్ విమానాశ్రయం తాలిబన్ల అధీనంలోనే ఉండేది. కాందహార్ విమానాశ్రయంపై తాలిబన్లు పట్టుసాధిస్తే మొత్తం ఈ ప్రావిన్సులు వారి అధీనంలోకి వెళ్తాయి. ఇప్పటికే దీనికి సమీపంలోని లష్కర్ గాహ్‌తో సహా కనీసం రెండు ఇతర ప్రావిన్షియల్ రాజధానులను స్వాధీనం చేసుకోవడానికి తాలిబన్లు సమీపించారు. అయితే, అఫ్గన్ ప్రభుత్వం మాత్రం వీటిని కొట్టిపారేస్తోంది. తాలిబన్లను సైన్యం సమర్ధంగా తిప్పికొడుతోందని పేర్కొంది.
By August 02, 2021 at 09:02AM
No comments