Mamata Banerjee దీదీ సీఎం పీఠం సేఫ్.. వచ్చే నెలలోనే బెంగాల్‌లో ఉప-ఎన్నికలు..!
పశ్చిమ్ బెంగాల్‌లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు సెప్టెంబరులో ఎన్నికలు జరిగే సూచనలు కనిపిస్తోంది. ఉప-ఎన్నికల విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ త్వరలో తుది నిర్ణయం తీసుకోనుందని ప్రచారం జరుగుతోంది. భవానిపుర్, ఖ్రాడా, శాంతిపుర్, దిన్హాటా, గోసబా, సంసెర్గుంజ్, జాంగిపుర్ శాసనసభ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరగాల్సి ఉంది. బెంగాల్‌లో విశ్వకర్మ పూజ ముగిసిన వెంటనే ఎన్నికలు జరుగుతాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడు నియోజకవర్గాల్లో ఎన్నికలకు సన్నాహాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని ఎన్నికల సంఘం పేర్కొంది. దీనికి ముందు రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి పరిస్థితి గురించి సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఓ లేఖ రాసింది. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. కోవిడ్ నియంత్రణలో ఉందని, అందువల్ల ఉప ఎన్నికలను నిర్వహించడంలో ఎలాంటి సమస్య ఉండదని పేర్కొంది. ఫలితంగా వచ్చే నెలలో ఉపఎన్నికలు జరగుతాయిని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏడాది మార్చి-ఏప్రిల్‌లో జరిగిన పశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన వరుసగా మూడోసారి అధికారం చేపట్టింది. అయితే, నందిగ్రామ్ నుంచి పోటీచేసిన ముఖ్యమంత్రి మాత్రం అభ్యర్థి, ఒకప్పటి మాజీ కుడిభుజం సువేందు అధికారి చేతిలో పరాజయం చవిచూశారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగ నిబంధనల ప్రకారం సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లోపు తప్పనిసరిగా ఆమె చట్టసభకు ఎన్నిక కావాల్సి ఉంది. ఒకవేళ నవంబరులోపు మమతా బెనర్జీ ఎన్నికకాకుంటే బెంగాల్‌లో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుంది. దీంతో తప్పనిసరిగా ఉప-ఎన్నికల్లో మమతా బెనర్జీ పోటీచేసి గెలవాల్సిన పరిస్థితి. ఈసారి తన సొంత నియోజకవర్గం భవానిపుర్ నుంచి దీదీ పోటీచేయనున్నారు. మరోవైపు, మండలి ఏర్పాటుకు కూడా బెంగాల్ సీఎం అసెంబ్లీలో తీర్మానం చేసి.. కేంద్రానికి పంపారు. మండలి ఏర్పాటయితే ఎమ్మెల్సీగా ఎన్నికైనా సీఎంగా కొనసాగడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అన్ని వైపుల నుంచి బెంగాల్ ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తున్నారు.
By August 12, 2021 at 10:53AM
No comments