Breaking News

Kabul అమెరికా విమానం నుంచి జారిపడి అఫ్గన్ ఫుట్‌బాల్ ప్లేయర్ మృతి


అఫ్గన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో ప్రజలు భయంతో దేశం వీడుతున్నారు. తాలిబన్ల అరాచకాల నుంచి తప్పించుకోవాలనే తాపత్రయంలో తమ ప్రాణాలను కూడా లెక్కచేయడంలేదు. విమానంలో చోటులేకపోవడంతో దాని రెక్కలపైకి ఎక్కి దేశం దాటేందుకు ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కాబూల్ విమానాశ్రయంలో విమానంపై నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయినవారిలో అఫ్గన్ జాతీయస్థాయి ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఒకరుగా గుర్తించారు. సోమవారం కాబూల్ విమానాశ్రయంలో అమెరికా విమానం నుంచి జారిపడి ఫుట్‌బాల్ ఆటగాడు జకీ అన్వారీ చనిపోయినట్టు అఫ్గన్ న్యూస్ ఏజెన్సీ అరినా గురువారం వెల్లడించింది. తాలిబన్లు మూకలు కాబూల్ నగరంలోకి చొరబడినప్పటి నుంచి వేలాదిగా అఫ్గన్లు దేశం విడిచి వెళ్లిపోయేందుకు సిద్ధపడ్డారు. చాలా మంది సిటీ బస్సు మాదిరిగా ఎగురుతున్న విమానంపైకి ఎక్కేందుకు ప్రయత్నించారు. అమెరికా వైమానిక దళానికి చెందిన సీ-17 విమానం నుంచి జకీ అన్వారీ జారిపడి చనిపోయినట్టు స్పోర్ట్స్ డైరెక్టరేట్ జనరల్ ధ్రువీకరించింది. హమీద్ కర్జాయ్ విమానాశ్రయంలో విమానం ఎక్కడానికి ప్రయత్నించిన వారిలో జకీ అన్వారీ ఒకరు కావడం బాధాకరం. అమెరికా విమానం టేకాఫ్ అవుతుండగా.. వందలాది మంది అఫ్గన్లు దాని వెంటబడి.. రెక్కలుపైకి ఎక్కి కూర్చున్నారు. ఎయిర్‌పోర్ట్ బయట ఓ మహిళ గేట్లు వద్ద ‘తనకు సాయం చేయాలని.. తాలిబన్లు వచ్చేస్తున్నారని’ ఆక్రందనలు చేస్తున్న ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాబూల్ ఎయిర్‌పోర్టుకు ఉప్పెనలా తరలివచ్చిన ప్రజలు విమానాలు ఎక్కేందుకు పోటీపడిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమెరికాకు చెందిన మిలటరీ కార్గో విమానం బోయింగ్ సీ-17 విమానం కాబూల్ నుంచి బయలుదేరింది. దీనిలో ప్రజలను ఆఫ్ఘాన్ నుంచి ఖతర్‌కు తరలించారు. అయితే ఈ విమానంలో ఏకంగా 640 మంది ఆఫ్ఘన్లు ఎక్కేశారు. విమానం అంత సామర్థ్యం తట్టుకోలేదని, కొందరు దిగిపోవాలని అధికారులు చెప్పినా సరే వారు వినిపించుకోలేదు. యూఎస్ అధికారులను పక్కకు నెట్టేసి మరీ విమానంలో ఎక్కేశారు. విమానం ప్రారంభమయ్యే ముందు కొందరిని దిగిపోవాలని అధికారులు సూచించినా ఎవరూ వెనక్కి తగ్గలేదు. దీంతో అమెరికా అధికారులు మానవత్వంతో ఆలోచించి ఎవరినీ దించకుండానే ఆ విమానాన్ని ఖతార్‌కు తీసుకెళ్లారు.


By August 20, 2021 at 10:14AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/afghanistan-football-player-zaki-anwari-dies-in-fall-from-us-plane-at-kabul-airport/articleshow/85478459.cms

No comments