India China Border Row 12 వ విడత చర్చలపై సంయుక్త ప్రకటన.. అదే రోజు గాల్వన్ వీడియో విడుదల చేసిన చైనా!
గతేడాది జూన్ 15న గల్వాన్ లోయ వద్ద భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన కొత్త వీడియో వెలుగులోకి వచ్చింది. ఘర్షణ జరిగిన రోజుల ఏం జరిగిందనేది ఇప్పటికే కొన్ని వీడియోలు బయటకు రాగా.. తాజాది మరిన్ని ఆధారాలను వెల్లడించేలా ఉంది. గల్వాన్ ఘర్షణల వీడియోను నిపుణుల ఇంటర్వ్యూలో మృతిచెందిన చైనా సైనికుల కుటుంబ సభ్యులు బయటపెట్టారు. మొత్తం 40 సెకెన్ల ఈ వీడియోను ప్రముఖ ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ట్విటర్ హ్యాండిల్ డెట్రస్‌ఫాలో విడుదల చేసింది. రాళ్లు రువ్వడం, ఇరు సైన్యాలు పరస్పరం దగ్గరకు వచ్చి ఘర్షణకు పాల్పడటం, నదిలో సైనికులు కొట్టుకుపోయిన దృశ్యాలు ఇందులో కనిపిస్తున్నాయి. తాజా వీడియో ప్రకారం.. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దూకుడును నిలువరించడంలో భారత సైనికులు ఎక్కడా తగ్గకుండా దీటుగా బదులిచ్చినట్టు అవగతమవుతోంది. గల్వాన్ ఘర్షణలో అనేక మంది చైనా సైనికులు నదిలో కొట్టుకుపోయినట్టు మీడియాలో వచ్చిన కథనాలను బలపరిచే విధంగా ఈ వీడియోలో దృశ్యాలు ఉన్నాయి. గల్వాన్ ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు అమరులు కాగా.. చైనా మాత్రం తమ వైపు ప్రాణనష్టం తక్కువేనని చెప్పుకుంటూ మేకపోతు గంభీర్యం ప్రదర్శించింది. అయితే, తాజా దృశ్యాలను చూస్తుంటే మాత్రం అమెరికన్ ఇంటెలిజెన్స్ నివేదిక చెబుతున్నట్టుగా అటువైపు భారీ సంఖ్యలోనే ప్రాణనష్టం జరిగినట్టే ఉంది. గతేడాది మే తొలివారం నుంచి భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండగా.. 2020 జూన్ 15న గల్వాన్‌లో ఇరు సేన్యాలూ ఘర్షణకు దిగాయి. 1962 తర్వాత తొలిసారి ప్రత్యక్ష దాడికి దిగాయి. కాగా, సరిహద్దు ఉద్రిక్తలపై భారత్- చైనాల మధ్య 12వ రౌండ్ చర్చలు ముగిసి.. సంయుక్త ప్రకటన విడుదల మర్నాడే ఈ వీడియో బయటకు రావడం గమనార్హం. సైన్యం ఉపసంహరణకు సంబంధించి ఇరు దేశాలు తమ అభిప్రాయాలను లోతుగా పంచుకున్నాయి.. తాజా సమావేశం పరస్పర అవగాహనను మరింత మెరుగుపరిచిందని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. దెప్సాంగ్, హాట్ స్ప్రింగ్స్, గోగ్రా సహా ఘర్షణల దారితీసే ప్రాంతాలపై తక్షణ పరిష్కారం అవసరమని భారత్ నొక్కి చెప్పింది.
By August 05, 2021 at 09:31AM
No comments