Breaking News

Happy Birthday Chiranjeevi : ‘స్వయంకృషి’తో ఎదిగిన ‘అందరివాడు’.. ఎందరికో ‘ఆపద్బాంధవుడు’


మెగాస్టార్ ఈ పేరు తెలుగు సినీ చరిత్రకే గర్వకారణం. సినీ పరిశ్రమ గతిని మార్చేసిన నిత్య శ్రామికుడు. దశాబ్దాలుగా చిత్రసీమను ఏలుతున్న ‘రాజా విక్రమార్క’ వంటి వారు. ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ బంధీగా ఉండే ‘ఖైదీ’. టాలీవుడ్‌కు మాత్రమే కాకుండా.. తెలుగు ప్రజలకు ‘అన్నయ్య’గా మారిపోయారు. సాయం కోసం ఎదురుచూస్తే క్షణాల్లో ప్రత్యక్షమయ్యే ‘శ్రీమంజునాథ’ స్వామి వంటివారు. చిరంజీవి పుట్టిన రోజు (ఆగస్ట్ 22) అంటే మెగా అభిమానులకే కాకుండా.. సినీ ప్రేమికులకు పండుగ. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలంలోనూ నిలదొక్కుకుని, కృష్ణ శోభన్ బాబులకు పోటీగా నిలబడి.. ఎగిసిపడ్డ కెరటం చిరంజీవి. అప్పటి వరకు మూసధోరణిలో పోతోన్న పరిశ్రమ రూపురేఖలను మార్చేశారు చిరంజీవి. తన మాటలు, యాక్షన్ సీక్వెన్స్, ఆటలు, డ్యాన్సులు ఇలా అన్నింటితో తెలుగు రాష్ట్రాలను ఆశ్చర్యపరిచారు. చిరంజీవి హెయిర్ స్టైల్, చిరంజీవి వేసుకున్న డ్రెస్సులు ఇలా ఓ ట్రెండ్ క్రియేట్ చేశాయి. ఇక బాక్సాఫీస్ రికార్డులకు కొత్త లెక్కలు చెప్పే ‘మాస్టర్’. ఇండస్ట్రీ హిట్లకు దారి చూపిన ‘హిట్లర్’. మాస్ అనే పదానికి పర్యాయపదంగా మారిన ‘గ్యాంగ్ లీడర్’. హీరోయిజం అనే మాటకు కొత్త రూపును తెచ్చిన ‘స్టేట్ రౌడీ’. రౌడీ అల్లుడుగా అలరించి అల్లుడా మజాకా అనిపించిన ‘ఘరానా మొగుడు’. ఇలా చిరంజీవి సినీ చరిత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇక చిరంజీవి సినీ హీరోగానే కాకుండా రియల్ హీరో అనిపించుకున్నారు. రక్తదానం, నేత్రదానం అంటూ ఎంతో మంది ప్రాణాలను కాపాడిన వారి మదిలో ‘జై చిరంజీవ’గా నిలిచిపోయారు. ఇక కరోనా సమయంలో ఎంతో మందికి ఎన్నో రకాలుగా సాయం చేశారు. ఇండస్ట్రీ అంతటి ఏకత్రాటికి తీసుకొచ్చి సీసీసీ కోసం నిధులు సేకరించారు. కరోనా సమయంలో సినీ శ్రామికులకు నిత్యావసర సరుకులు అందించి ఎన్నో కుటుంబాలను ఆదుకున్న ‘ఆపద్బాంధవుడు’. వ్యాక్సినేషన్ కార్యక్రమాలు, ఆక్సిజన్ బ్యాంక్‌లు ఇలా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ ప్రపంచానికి తెలిసినవే.. ఇంకా తెలియని, బయటకు రాని సహాయ కార్యక్రమాలెన్నో ఉన్నాయి. స్వయంకృషికి నిలువెత్తు నిదర్శనం. అందరివాడు అనే దానికి అర్థం. మొత్తంగా ‘స్వయంకృషి’తో ఎదిగిన ‘అందరివాడు’ చిరంజీవి.


By August 22, 2021 at 07:36AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/hbd-chiranjeevi-megastar-birthday-special-article/articleshow/85528632.cms

No comments