Breaking News

Border గోగ్రా నుంచి వెనక్కు మళ్లిన భారత్, చైనా.. కానీ, దెప్సాంగే ప్రధాన సమస్య!


సరిహద్దుల్లో భారత్‌-చైనాల మధ్య గత 15 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు దక్షిణ తీరం నుంచి ఇరు సైన్యాలూ వెనక్కితగ్గిన విషయం తెలిసిందే. తాజాగా బుధ, గురువారాలు గోగ్రా హైట్స్‌ నుంచి భారత్, చైనా సేనలను ఉపసంహరించుకున్నాయి. భారత్‌కు ఎంతో కీలకమై సమీపంలోని పెట్రోలింగ్‌ పాయింట్‌ 17-ఎ నుంచి బలగాలు వైదొలగడంతో ఈ ప్రాంతంలో బఫర్‌ జోన్‌ ఏర్పాటైంది. ఇరుదేశాల సైనికులు తిరిగి తమ శాశ్వత స్థావరాలకు చేరుకున్నారు. ‘‘రెండువైపులా నిర్మించిన తాత్కాలిక నిర్మాణాలు, ఇతర మౌలిక వసతులు కూల్చివేత జరిగింది. దీన్ని ఇరు సైన్యాలు ధ్రువీకరించాయి. మే తొలివారం ముందు నాటి పరిస్థితి తిరిగి నెలకొంది’’ అని సైన్యం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. గోగ్రాతో సరిహద్దు వెంబడి మరో ముఖాముఖి పరిస్థితి పరిష్కారమైందని పేర్కొంది. పశ్చిమ సెక్టార్‌లో మిగిలిన సమస్యలనూ పరిష్కరించుకోవడానికి ఇరు పక్షాలు నిబద్ధతతో ఉన్నాయని వివరించింది. ‘ఈ ప్రాంతంలో వాస్తవధీన రేఖను ఇరు దేశాలూ కచ్చితంగా గమనించి, గౌరవిస్తారని, యథాతథ స్థితిలో ఏకపక్ష మార్పు లేదని ఈ ఒప్పందం నిర్ధారిస్తుంది’ అని వ్యాఖ్యానించింది. గోగ్రా పోస్ట్ నుంచి బలగాలను ఉపసంహరించాలని ఇటీవల జరిగిన 12వ దఫా కోర్‌ కమాండర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గల్వాన్‌ లోయ, పాంగాంగ్‌ తర్వాత గోగ్రా నుంచి కూడా బలగాల ఉపసంహరణ పూర్తి కావడం సానుకూల పరిణామని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే, గోగ్రా నుంచి వైదొలగినా దెప్సాంగ్ అతి పెద్ద సమస్యని అంటున్నారు. పీపీ-17ఏ నుంచి ఇరు దేశాల సైన్యాలూ వెనక్కు వెళ్లడంతో ఐదు కిలోమీటర్ల మేర బఫర్ జోన్ ఏర్పడింది. ఏదిఏమైనా ఇరువైపులా తూర్పు లడఖ్‌లోని వాస్తవధీన రేఖ (LAC) వెంబడి ట్యాంకులు, ఫిరంగి దళాలు, ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయోగించే క్షిపణుల సహా 50,000 మంది సైనికుల చొప్పున మోహరిస్తూనే ఉన్నారు. వాస్తవానికి పాంగాంగ్‌ సరస్సు నుంచి బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత జరిగిన భారత్‌-చైనా కోర్‌ కమాండర్‌ స్థాయి చర్చల్లో పెద్దగా పురోగతి కనిపించలేదు. సుదీర్ఘంగా సమావేశాలు జరిగినా.. సమస్య పరిష్కారానికి చైనా మొగ్గు చూపకపోవడంతో ముందుడుగు పడలేదు. ఈ నేపథ్యంలో జులై 14న భారత్‌, చైనా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులు జైశంకర్, వాంగ్ యీ మధ్య తజకిస్థాన్‌ రాజధాని దుశాంబే వేదికగా చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రస్తుత పరిస్థితులే కొనసాగితే ద్వైపాక్షిక సంబంధాలు మరింత ప్రభావితమవుతాయని జైశంకర్‌ హెచ్చరించారు. దీంతో చైనా వైఖరిలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జరిగిన 12వ రౌండ్‌ కోర్‌ కమాండర్ల సమావేశంలో చైనా అంతకుముందు ప్రదర్శిస్తూ వచ్చిన తన మొండి వైఖరిని వీడి... సానుకూలంగా స్పందించింది. దీంతో గోగ్రా సమస్య పరిష్కారమైంది. ఇక దెప్సాంగ్‌, దెమ్‌చోక్‌, హాట్‌స్ప్రింగ్‌ ప్రాంతాల్లో కూడా బలగాల ఉపసంహరణ పూర్తయితే వాస్తవాధీన రేఖ వెంబడి తిరిగి శాంతియుత పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుంది.


By August 07, 2021 at 07:56AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/lac-row-india-china-complete-gogra-disengagement-but-depsang-remains-a-major-problem/articleshow/85119809.cms

No comments