షోలే సినిమాలో పాటను అద్భుతంగా పాడిన సీఎం.. నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్


మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గాయకుడిగా మారి.. బాలీవుడ్ సూపర్‌హిట్ షోలే సినిమాలోని ఓ పాటను అద్బుతంగా ఆలపించారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్‌వర్గీయతో కలిసి సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ పాటపాడి అలరించారు. ఈ వీడియోను ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. బుధవారం సాయంత్రం మధ్యప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఈ ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని, కైలాస్‌తో కలిసి గొంతు కలిపారు. స్నేహం గొప్పదనాన్ని తెలిపే ‘యే దోస్తీ హమ్ నహీ చోడ్‌దేంగే’ పాటను ఇరువురు నేతలూ ఆలపించారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి శివరాజ్ సింగ్ చౌహన్, కైలాష్ విజయవర్గీయ మధ్య మంచి స్నేహం ఉంది. గతంలోనూ ఇరువురు నేతలూ పలుసార్లు పాటలు పాడిన సందర్భాలున్నాయి. తాజాగా అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో పాటపడి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఈ వీడియో షేర్ చేసిన శివరాజ్ సింగ్ చౌహన్.. షోలే సినిమాలో నటించిన నటులు అమితాబ్ బచ్చన్, ధర్మేంద్రలను ట్యాగ్ చేశారు. కాగా, శివరాజ్ సింగ్ చౌహాన్ తన ముగ్గురు దత్త పుత్రికలకు ఒకేసారి వివాహం జరిపించిన విషయం తెలిసిందే. సీఎం శివరాజ్.. తన దత్తపుత్రికలను ఏ లోటూ రాకుండా పెంచి పెద్ద చేసి, వారిని ఓ ఇంటి వాళ్లను చేశారు. జులై 17న విదిశా పట్టణంలోని గణేష్ ఆలయంలో ఈ ముగ్గురు అమ్మాయిలకు ఒకేసారి వివాహం జరిపించారు. సంప్రదాయ పద్ధతిలో సాదాసీదాగా జరిగిన ఈ వేడుకలో శివరాజ్ సింగ్, ఆయన సతీమణి సాధన.. వరుల కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. అప్పగింతల వేళ సాధన భావోద్వేగానికి గురయ్యారు.
By August 12, 2021 at 09:40AM
No comments