Breaking News

జైలు సిబ్బంది సాయంతో దర్జాగా వ్యవహారాలు.. యునిటెక్ అధినేత బాగోతం బట్టబయలు!


మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టయిన వ్యాపారవేత్త విచారణ ఖైదీగా తిహార్‌ జైలులో ఉన్నారు. అయితే, అక్కడ నుంచే నిందితులు వ్యవహారాలన్నీ చక్కబెట్టిన విషయాన్ని సాక్షాత్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గురువారం దృష్టికి తీసుకువచ్చింది. కొనుగోలుదార్లను మోసగించారన్న ఆరోపణలపై అరెస్టయిన యునిటెక్‌ సంస్థ వ్యవస్థాపకుడు రమేష్‌ చంద్ర..దక్షిణ ఢిల్లీలో భూగర్భ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు ఈడీ పేర్కొంది. ఈ విషయాన్నిజస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎంఆర్‌ షాలతో కూడిన ధర్మాసనం దృష్టికి అదనపు సొలిసిటర్‌ జనరల్‌ మాధవీ దివాన్‌ తెలిపారు. ఈ కేసులకు సంబంధించి ఈడీ రెండు నివేదికలను అందజేసింది. ఇదే కేసులో అరెస్టయిన రమేష్‌ చంద్ర కుమారులు, ఆ సంస్థ మాజీ డైరెక్టర్లు సంజయ్‌ చంద్ర, అజయ్‌ చంద్రలు కూడా ఇదే జైలులో ఉన్నారు. పెరోల్‌పై విడుదలైన సమయంలో ఆ కార్యాలయాన్ని సందర్శించారు. ‘‘రహస్య కార్యాలయంలో సోదాలు నిర్వహించినప్పుడు అక్కడ వందలాది ఒరిజినల్‌ డాక్యుమెంట్లు.. వందలకొద్దీ డిజిటల్‌ సంతకాలు కూడా ఉన్నాయి. దేశ విదేశాల్లోని ఆస్తుల వివరాలు కలిగిన కంప్యూటర్లు ఉన్నాయి. జైలు బయట సంస్థ సిబ్బందిని ఉంచి నిందితులు వారికి ఆదేశాలు ఇస్తున్నారు’’ అని ఈడీ తన నివేదికలో పేర్కొంది. ఈ సమయంలో రమేష్‌ చంద్ర తరఫు న్యాయవాది వికాస్‌ సింగ్‌ జోక్యం చేసుకుంటూ.. జైలు నిబంధనలకు వ్యతిరేకంగా ఏమీ చేయలేదని వాదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. తాము ప్రస్తుతం దర్యాప్తు సంస్థ చెప్పేది వింటున్నామని, నిందితుల తరఫు వాదనలు కాదని తేల్చిచెప్పింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి తిహార్‌ జైలు సిబ్బంది సహకారంతో ఇదంతా చేయగలిగారని భావించిన ధర్మాసనం.. సంజయ్‌ చంద్ర, అజయ్‌ చంద్రలను ముంబయిలోని అర్ధర్‌ రోడ్‌, తాలోగా జైళ్లకు తరలించాలని స్పష్టం చేసింది. జైలు సిబ్బంది వ్యవహారంపై దర్యాప్తు జరిపి, నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఢిల్లీ పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది. ఈ సందర్భంగా జైలు అధికారులపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘‘న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించడానికి జైలు అధికారులతో కుమ్మక్కయ్యారు.. తిహార్‌ జైలు సూపరెంటెండెంట్‌, ఆయన సిబ్బందికి ఏ మాత్రం సిగ్గులేదు.. దేశ రాజధానిలో ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహిస్తారా? తిహార్‌ జైలు అధికారులపై నమ్మకాన్ని కోల్పోయాం.. రాజధానిలో కూర్చొని మా ఆదేశాలను విఫలం చేస్తున్నారు.. వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం’’ అని వ్యాఖ్యానించింది. యునిటెక్ సంస్థ 2006- 2014 మధ్య 74 ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టులు చేపడతామని 29,800 మంది నుంచి రూ.14,270 కోట్లు, ఆరు ఆర్థిక సంస్థల నుంచి రూ.1805 కోట్లు సేకరించినట్టు ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో వెల్లడయ్యింది. ఇందులో కొంత మొత్తం దుర్వినియోగమైనట్టు తేలడంతో రూ.750 కోట్లు డిపాజిట్‌ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ సంస్థ డైరెక్టర్లను తొలగించి, రిటైర్డు ఐఏఎస్‌ అధికారి ఆధ్వర్యంలో కొత్త బోర్డు ఏర్పాటు చేసింది. కోర్టు సూచనల మేరకు మొత్తం నగదును డిపాజిట్‌ చేసినందున తమకు రెగ్యులర్‌ బెయిల్‌ ఇవ్వాలని నిందితులు అభ్యర్థించారు. ఈ కేసులో 2017 నుంచి రమేశ్ చంద్ర, ఆయన తనయులు జైలులో ఉన్నారు. సంజయ్ చంద్ర మామ చనిపోవడంతో ఆయన అంత్యక్రియల కోసం జూన్ 4న 15 రోజుల మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు మంజూరుచేసింది. రెండు వారాల తర్వాత ఆయన సంజయ్ వెనక్కు వచ్చారు. గతేడాది ఆగస్టు 14న అతడు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 2015లో ఓ బాధితుడు ఫిర్యాదుతో యునిటెక్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఒకరు తర్వాత ఒకరు ఇళ్ల కొనుగోలుదారులు 173 మంది ఇలా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.


By August 27, 2021 at 11:20AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/unitech-founders-operated-from-secret-underground-office-ed-reveals/articleshow/85679332.cms

No comments