Breaking News

ఐరాస సిబ్బందిపై తాలిబన్ దాడులు, బెదిరింపులు.. అంతర్గత నివేదికలో సంచలన విషయాలు


అఫ్గనిస్థాన్‌లోని ఐక్యరాజ్యసమితి సిబ్బంది ఆదివారం కాబూల్ విమానాశ్రయానికి వస్తుండగా అడ్డుకుని దాడికి పాల్పడ్డారు. వాహనాలను తనిఖీ చేసి, ఐరాస గుర్తింపు కార్డులు చూసి భౌతిక దాడి చేశారు. అలాగే, సోమవారం ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఐరాస ఉద్యోగి ఇంటికి వచ్చి బెదిరించారు. ఉద్యోగి తండ్రి, కుమారుడి గురించి ఆరా తీసి.. వాళ్లు ఏక్కడున్నారో మాకు తెలుసు.. అబద్దాలు చెబుతున్నారు అని హెచ్చరించారు. ఐరాస భద్రత విభాగం అంతర్గత నివేదికలో ఈ ఘటనల గురించి వివరించారు. ఆగస్టు 10 నుంచి ఐరాస సిబ్బందిని బెదిరించడం, భౌతిక దాడులు చేయడం, కార్యాలయాల్లోకి దూరి లూటీ చేయడం వంటి అరాచకాలకు పాల్పడుతున్నట్టు నివేదిక తెలిపింది. అఫ్గన్ ప్రజల హక్కులను గౌరవిస్తామని, ఎటువంటి ప్రతీకార దాడులకు పాల్పడబోమని తాలిబన్లు ఇచ్చిన హామీలు నీటిపై రాతలగానే మిగిలిపోయాయి. క్షేత్రస్థాయిలో ముష్కర మూకలు అరాచకాలకు పాల్పడుతున్నారు. ఈ నివేదికపై తాలిబన్లు స్పందించడానికి నిరాకరించారు. వేధింపులపై విచారణ జరిపిస్తామని, ఐరాస కార్యక్రమాలకు సహకరిస్తామని తాలిబన్లు ప్రకటించారు. అయితే, బయటకు వచ్చిన సెక్యూరిటీ నివేదికపై ఎటువంటి వ్యాఖ్యలు చేయబోమని ఐరాస పేర్కొంది. ఐక్యరాజ్యసమితి అధికార ప్రతినిధి స్టెఫానే డుజారిక్ మాట్లాడుతూ.. ‘కాబూల్‌లో , కార్యాలయాల భద్రతకు అక్కడ అధికారులు బాధ్యత వహిస్తారు.. ఆ విషయంలో మేము వారితో నిరంతరం మాట్లాడుతూ ఉంటా’ అన్నారు. మొత్తం 300 విదేశీ సిబ్బందిలో ఒక వంతు మందిని నుంచి కజికిస్థాన్‌కు ఐరాస తరలించింది. అలాగే, అఫ్గన్ ప్రజలకు సాయం చేయడానికి కూడా సిద్ధమని తెలిపింది. అఫ్గన్‌లో ఇంకా 3,000 మంది ఐరాస సిబ్బంది ఉన్నారని, వారిలో కొందరికి తక్షణమే తాత్కాలిక వీసాలు, సౌకర్యం కల్పించాలని ఇతర దేశాలను సంప్రదిస్తున్నట్టు డుజారిక్ తెలిపారు. అఫ్గన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న తర్వాత వేలాది మంది ప్రజలు విదేశాలకు తరలిపోతున్నారు. కాబూల్ విమానాశ్రయం ద్వారా విదేశీ యుద్ధ విమానాలు, వాణిజ్య విమానాలతో దేశం విడిచి వెళుతున్నారు. తాలిబన్ల దుర్మార్గపు పాలన మళ్లీ మొదలవుతుందనే భయంతో శరణార్థులుగా వెళ్లిపోతున్నారు.


By August 26, 2021 at 09:43AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/internal-un-document-says-taliban-threatened-beat-staff-in-afghanistan/articleshow/85646542.cms

No comments