‘తాలిబన్ల ముందు ఓటమిని ఒప్పుకున్నారు.. చరిత్రలోనే వ్యూహాత్మక తప్పిదం’ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అఫ్గనిస్థాన్ నుంచి వైదొలగడంతో తాలిబన్ మూకలు రెండు దశబ్దాల తర్వాత తిరిగి దేశాన్ని హస్తగతం చేసుకోవడంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇది అమెరికా చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఓటమని అమెరికా మాజీ అధ్యక్షుడు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి జో బైడెన్‌పై విమర్శలు గుప్పించారు. తాలిబన్లను నిలువరించడంలో విధానాలు విఫలమయ్యాయని ట్రంప్ దుయ్యబట్టారు. తాలిబన్ల ముందు ఓటమి అంగీకరించారని, చరిత్రలోనే అతిపెద్ద వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడ్డ బైడెన్ ప్రజలకు క్షమాపణ చెబుతారా అని ఆయన నిలదీశారు. శనివారం జరిగిన ఓ మీడియా సమావేశంలో బైడెన్‌పై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇది సేనల ఉపసంహరణ కాదు.. ఓటమిని ఒప్పుకోవడం.. అమెరికా అంటే తాలిబన్లకు ప్రస్తుతం భయం, గౌరవం లేకుండా పోయింది.. కాబూల్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై తాలిబన్ల జెండా ఎగిరితే ఎంతటి అపఖ్యాతి.. ఊహించుకోడానికే సిగ్గుగా ఉంది.. బలహీనత, చేతకానీతనంతో వచ్చిన వైఫల్యం ఇది’’ అని ట్రంప్ దుయ్యబట్టారు. ‘బాధ్యతరాహిత్యంగా మరణం అంచున అమెరికన్లను వదిలివేయడం క్షమించరాని నేరం.. ఇది అపఖ్యాతికి కారణమవుతుంది’ అని ఆరోపించారు. తాలిబన్ల ఆక్రమణ తర్వాత డజన్ల కొద్దీ ప్రకటనలతో బైడెన్‌పై ట్రంప్ విరుచుకుపడుతున్నారు. అయితే, బలగాల ఉపసంహరణ నిర్ణయాన్ని బైడెన్ సమర్ధించుకున్నారు. వాస్తవానికి డొనాల్డ్ ట్రంప్ హాయాంలోనే దీనికి బీజం పడింది. గతేడాది ఫిబ్రవరిలో తాలిబన్లు, అఫ్గన్ పౌర ప్రభుత్వంతో జరిగిన శాంతి ఒప్పందంపై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అయితే, ఊహించిన దానికంటే వేగంగా తాలిబన్లు అఫ్గన్ ప్రభుత్వాన్ని పడగొట్టారని బైడెన్ వ్యాఖ్యానించారు. తన ముందు రెండు మార్గాలు ఉన్నాయని, ఈ ఏడాది అమెరికా దళాలను అఫ్గాన్ నుంచి వెనక్కి రప్పించడం లేదా మరిన్ని సైనిక దళాలను అఫ్గాన్‌కు పంపి మూడో దశాబ్దంలో కూడా యుద్ధాన్ని కొనసాగించడం అని అన్నారు. అయితే గతంలో చేసిన తప్పులను తాను చేయకూడదని నిర్ణయించుకున్నానని, అందుకే సైనిక బలగాల ఉపసంహరణ నిర్ణయానికే కట్టుబడి ఉన్నానన్నారు. ఈ నిర్ణయం అమెరికాకు సరైందనేనని, అమెరికాపై ఉగ్రదాడులను నిరోధించడమే మా లక్ష్యమని బైడెన్ స్పష్టం చేశారు. ఆఫ్గనిస్తాన్‌లో అమెరికా ప్రజలపై తాలిబన్లు దాడి చేస్తే తీవ్ర పరిస్థితులు ఉంటాయని బైడెన్ హెచ్చరించారు. ఆ దేశంలో జాతి నిర్మాణం తమ బాధ్యత కాదని, అమెరికాపై ఉగ్రవాదులను నిరోధించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
By August 22, 2021 at 08:48AM
No comments