Breaking News

అఫ్గన్‌లో తిరుగుబాటు.. తాలిబన్ల కాల్పుల్లో పలువురుమృతి.. ఆ ప్రాంతంలో ఎగరని ముష్కర జెండా!


అఫ్గనిస్థాన్‌లో తాలిబన్ల అరాచక విధానాలపై ప్రజలు క్రమంగా తిరగబడుతున్నారు. ఎక్కడికక్కడే తాలిబన్లకు ధిక్కార స్వరం ఎదురవుతోంది. అఫ్గన్‌ స్వాతంత్య్ర దినోత్సవమైన గురువారం నాడు పలు ప్రాంతాల్లో ప్రజలు ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. తాలిబన్‌ జెండాలను దించేసి, అఫ్గన్ జాతీయ పతాకాన్ని ధైర్యంగా ఎగరేసి ప్రజాస్వామ్య కాంక్షను చాటిచెప్పారు. ఊహించని విధంగా ఎదురవుతున్న వ్యతిరేకతతో తాలిబన్లకు అహం దెబ్బతింది. ప్రజా ఉద్యమాన్ని ఆదిలోనే అణచివేసే ప్రయత్నాల్లో భాగంగా హింసకు పాల్పడుతున్నారు. గురువారం తాలిబన్లు జరిపిన కాల్పుల్లో పలువురు గాయపడగా.. అసదాబాద్‌ నగరంలో కొందరు మృతిచెందినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాలిబన్లపై సాయుధ పోరాటానికి పంజ్‌షేర్‌ ప్రావిన్సు కేంద్రంగా అఫ్గాన్‌ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ నేతృత్వంలో వ్యూహరచన సాగుతున్నట్లు తెలుస్తోంది. తాను దేశం వీడటాన్ని అఫ్గనిస్థాన్‌ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ సమర్థించుకున్నారు. రక్తపాతాన్ని నిలువరించేందుకు అదొక్కటే మార్గమని.. అందుకే కట్టుబట్టలతో తాను దేశాన్ని వీడినట్లు చెప్పారు. అంతేకాదు, వందల కోట్లు తీసుకొని దేశం వీడినట్లుగా వస్తున్న వార్తలను ఘనీ ఖండించారు. కాబుల్‌ నగరంతో పాటు ఖోస్త్‌, నంగర్హర్‌, కునార్‌ ప్రావిన్సుల్లో ప్రజలు పెద్దఎత్తున వీధుల్లోకి వచ్చిన నిరసనలు తెలిపారు. పురుషులతో పాటు మహిళలూ జాతీయ జెండాను చేతబూని వీధుల్లోకి వచ్చారు. కాబుల్‌ విమానాశ్రయం సమీపంలో వందల మంది కార్లతో ర్యాలీ నిర్వహించారు. నంగర్హర్‌లో నిరసనకారులపై తాలిబన్లు కాల్పులు జరపడంతో పలువురు గాయపడ్డారు. ఖోస్త్‌లోనూ ప్రజలపై ముష్కరులు విరుచుపడ్డారు. అక్కడ 24 గంటలపాటు కర్ఫ్యూ విధించారు. కునార్‌ ప్రావిన్సులోని అసదాబాద్‌లో తాలిబన్లు జరిపిన కాల్పుల్లో కొందరు ప్రాణాలు కోల్పోయారని వార్తలొస్తున్నాయి. ఇప్పటికీ తాలిబన్ల అధీనంలోకి రాని పంజ్‌షేర్‌ ప్రావిన్సులో అఫ్గన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ నేతృత్వంలో కీలక చర్చలు కొనసాగుతున్నాయి. ‘నార్తర్న్‌ కూటమి’ పేరిట తాలిబన్లపై సాయుధ పోరాటానికి ఆయన నాయకత్వంలో ఇక్కడ నేతలు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. అష్రాఫ్‌ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయిన నేపథ్యంలో తనను తాను ఆపద్ధర్మ అధ్యక్షుడిగా సలేహ్‌ ప్రకటించుకున్నారు. తాలిబన్లకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన ప్రజలకు ఆయన తన మద్దతు ప్రకటించారు. ‘జాతీయ జెండాను పట్టుకుని దేశం కోసం నిలబడిన వారికి సెల్యూట్ చేస్తున్నాను’ అంటూ సలేహ్ ట్వీట్ చేశారు. బ్రిటిషర్ల నుంచి 1919 ఆగస్టు 19న అఫ్గనిస్థాన్‌కు స్వాతంత్రం సిద్ధించింది. స్వేచ్ఛావాయువులు పీల్చుకుని వందేళ్లు దాటినా అఫ్గన్‌లో ఇంకా అనిశ్చితే కొనసాగుతోంది. నిరంతరం అంతర్గత పోరుతో అఫ్గన్ల ఉనికే ప్రశ్నార్ధకంగా మారింది. తమ అస్థిత్వం కోసం పోరాడుతున్న అక్కడ ప్రజలు.. ముజాయిద్దీన్‌లు, తాలిబన్ల అరాచక పాలనలో విసిగివేశారిపోయారు. అయితే, 2001 తర్వాత పరిస్థితిలో కొంత మార్పు రావడంతో సంతోషించారు. కానీ, వారి ఆనందం అంతలోనే ఆవిరయ్యింది. రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ అరాచకవాదుల చేతుల్లోకి దేశం వెళ్లడంతో ఆందోళన చెందుతున్నారు.


By August 20, 2021 at 06:35AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/several-killed-open-fire-on-protesters-vice-president-amrullah-saleh-fight-against-to-taliban/articleshow/85475761.cms

No comments