Breaking News

పెట్టుబడుల పేరుతో భారీ మోసం.. అమెరికాలో భారత సంతతి ప్రముఖుడు అరెస్ట్!


తన సంస్థలో పెట్టుబడుల పేరుతో భారీ మొత్తం వసూలు చేసిన భారత సంతతికి చెందిన వ్యక్తిని అమెరికా అధికారులు అరెస్ట్ చేశారు. అధిక మొత్తంలో ఇన్వెస్టర్ల నుంచి డబ్బులు వసూలు చేసిన అతడి మోసాలు బయటపడటంతో అరెస్ట్ చేసి, జైలుకు పంపారు. ఆర్ధిక నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ భారత సంతతికి చెందిన మనీష్ లచ్వానీ (45)ని యూఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హెడ్‌స్పిన్‌ సంస్థ మొబైల్ యాప్ టెస్టింగ్ ప్లాట్‌ఫాం కోసం 100 మిలియన్ డాలర్లను పెట్టుబడుల రూపంలో మనీష్ సేకరించాడు. అయితే, వ్యాపార లావాదేవీలకు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చి, దాదాపు 80 మిలియన్ డాలర్ల మేర కాజేశాడు. అంతేకాదు, ఆదాయం పెరిగేలా చేయాలని ఉద్యోగులపై అనేక సందర్భాల్లో ఒత్తిడి తీసుకొచ్చాడు. 2015 నుంచి 2020 మార్చి మధ్యలో మనీష్ మోసాలకు పాల్పడినట్టు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వీటి ఆధారంగా హెడ్‌స్పిన్ ఆర్థిక లావాదేవీలను ఆడిటింగ్ సంస్థ పరిశీలించడంతో మనీష్ మోసాలు బయటపడ్డాయి. కంపెనీ కార్యకాలాపాలను ప్రారంభించిన నాటి నుంచి 2020 ప్రథమార్థం వరకు హెడ్‌స్పిన్ ఆదాయం 26.3 మిలియన్ డాలర్లు మాత్రమేనని.. నివేదికల్లో చూపినట్టు 95.3 మిలియన్ డాలర్లు కాదని ఆడిటింగ్ సంస్థ బయటపెట్టింది. ఈ క్రమంలో అధిక ఆదాయం చూపించి.. ఇన్వెస్టర్ల నుంచి భారీ మొత్తంలో పెట్టుబడులను వసూలు చేసినట్టు గుర్తించింది. అలాగే, 2020 ప్రథమార్ధంలో ఆ కంపెనీ సుమారుగా నివేదించిన 3.7 మిలియన్ డాలర్లు నికర ఆదాయానికి బదులుగా మొత్తం 15.9 మిలియన్ డాలర్ల నష్టమని తెలిపింది. దీంతో పలు సెక్షన్ల కింద మనీశ్ లచ్చానీపై కేసులు నమోదు చేసిన అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నేరం రుజువైతే మనీష్‌కు 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు భారీ జరిమానా ఉంటుందని న్యాయనిపుణులు అంటున్నారు. ఇదిలా ఉంటే.. హెడ్‌స్పిన్‌ సంస్థను స్థాపించడానికి ముందు అమెజాన్ టాబ్లెట్ ది కిండల్ కోసం మొదటి ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించి మనీశ్ మంచి గుర్తింపు పొందాడు. అలాగే, 2014 లో గూగుల్ కొనుగోలు చేసిన మొబైల్ టెస్టింగ్ ప్లాట్‌ఫామ్ అపురిఫైని సృష్టించడంలో సహాకరించారు.


By August 27, 2021 at 09:23AM


Read More https://telugu.samayam.com/latest-news/nri/indian-origin-ex-ceo-of-headspin-manish-lachwani-startup-charged-with-fraud-in-us/articleshow/85677311.cms

No comments