Breaking News

ఐరాస సంచలన నిర్ణయం.. ఉగ్రవాదుల జాబితా నుంచి తాలిబన్లు తొలగింపు!


ఉగ్రవాదంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి విడుదల చేసిన ఓ ప్రకటనలో తాలిబన్లను ఆ జాబితా నుంచి తప్పించడం చర్చనీయాంశమవుతోంది. ఆగస్టు 27న విడుదల చేసిన ఈ ప్రకటనలో కాబుల్‌ విమానాశ్రయంపై ఆత్మాహుతి దాడిని ఖండించింది. తాజాగా ఆగస్టు నెలకు భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తోన్న భారత్.. ఆ హోదాలో ఉత్తర్వులపై సంతకం చేసింది. అంతకు ముందు తాలిబన్లు కాబూల్‌ను ఆక్రమించిన మర్నాడే ఆగస్టు 16న ఐరాస ఇటువంటి ప్రకటనే విడుదల చేసింది. ఆ ప్రకటనలో ‘తాలిబన్‌, ఇతర అఫ్గన్‌ గ్రూపులు లేదా వ్యక్తులు ’అని స్పష్టంగా ఉంది. ఈ రెండు ప్రకటనల్లో మార్పును గతలంలో ఐరాసలో భారత రాయబారిగా పనిచేసిన సయ్యద్‌ అక్బరుద్దీన్‌ బయటపెట్టారు. ‘‘దౌత్యంలో రెండు వారాలనేది చాలా ఎక్కువ సమయం. ‘టి’అనే పదం మాయమైపోయింది. ఆగస్టు 16,27 తేదీల్లో విడుదలైన ఐరాస ప్రకటనల్లో నేను మార్క్‌ చేసిన చోట చూడండి’’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. రెండు ప్రకటనలను ట్వీట్‌కు జత చేశారు. ప్రస్తుతం అక్బరుద్దీన్‌ ‘కౌటీల్యా స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ’ డీన్‌గా పనిచేస్తున్నారు. ‘అర్ధవంతమైన చర్యల ద్వారా అఫ్గన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడాలి.. అన్ని వర్గాలకూ ప్రాధాన్యత ఇవ్వాలి.. మహిళలను కూడా ప్రభుత్వం భాగస్వాములను చేసిన వారి హక్కులను పరిరక్షించాలి.. తక్షణమే హింసను వదలిపెట్టి ప్రస్తుత సంక్షోభం నివారణకు ప్రయత్నించాలి.. అంతర్జాతీయ న్యాయచట్టాలు.. మానవహక్కులను పరిరక్షించాలి.. అఫ్గన్‌లోని విదేశీయుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలి.. అఫ్గన్‌లోని శాంతి స్థాపనకు అంతర్జాతీయ సమాజం కూడా సహకరించాలి’ ఆగస్టు 16న విడుదల చేసిన ప్రకటనలో ఐరాస పేర్కొంది. ఇదిలా ఉండగా, ఆగస్టు 19న నాయకత్వంపై భారత్ వైఖరేంటి? వారితో ఎలా వ్యవహరిస్తారనే ప్రశ్నకు విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్పందిస్తూ.. ఇప్పుడే దీనిపై ఏం మాట్లాడలేమని, మా దృష్టంతా అఫ్గనిస్థాన్‌లోని భారతీయుల సంరక్షణ, భద్రతపైనే ఉందని బదులిచ్చారు. అయితే, అఫ్గన్‌లో ఎంత మంది భారతీయులు ఇంకా ఉన్నారనేది ఖచ్చితంగా తెలియదని భారత్ శుక్రవారం ప్రకటించింది. ఇటీవల భారత ఎంబసీల్లోకి చొరబడిన తాలిబన్లు కీలక డాక్యుమెంట్ల కోసం వెదికిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వ అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.


By August 30, 2021 at 08:30AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/un-security-council-dropped-taliban-reference-from-a-paragraph-in-its-statement-on-terrorist/articleshow/85755685.cms

No comments